తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకుల పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ స్వార్ధ రాజకీయాల కోసం సినిమా వాళ్ళను టార్గెట్ చేయకూడదని దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ట్వీట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా.. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా ఉన్నంత వరకు వాక్‌స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. మంత్రి చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా, సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్‌లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నా. మన దేశంలోని మహిళలను, మన సినీ పరిశ్రమ వారిని చాలా గౌరవంగా చూడాలని ఆయన అన్నారు.
విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు, వారి ప్రవర్తనపై నా ఆలోచనలు భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి కష్టపడుతున్నాను. మనల్ని చూసుకోవడానికి, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల గురించి మాట్లాడటానికి, ఉద్యోగాలు శ్రేయస్సును తీసుకురావడానికి, ఆరోగ్యం గురించి మాట్లాడటానికి విద్య, సౌకర్యాలను మెరుగుపరచడానికి, మమ్మల్ని ఎదిగేలా చేయడానికి మేము వారికి ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాను.. ప్రజలుగా రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదని ఖచ్చితంగా చెప్పాలంటూ ఆయన ట్వీట్ చేశారు.
మరోపక్క సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయి , ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు , నిన్నటి రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం , ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి , మీడియా ముఖంగా మాట్లాడటం , వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు కానీ ఓ మహిళ ఆత్మాభిమానం , ఓ కుటుంబం పరువు , ప్రతిష్టలకు తీరని నష్టం , అన్యాయం జరిగింది . గౌరవనీయులైన మంత్రివర్యులకు , రాజకీయ విమర్శలకు , ఏ మాత్రం సంబంధం లేని , తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులైన సినీనటులను బలిచేయవద్దని , జరిగిన తొందరపాటు చర్యను , విజ్ఞులైనమీరు పెద్దమనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ , భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నట్టు ఆయన రాసుకొచ్చారు.