Varanasi Update: ఇదొక అప్‌డేటే.. అసలైన బ్లాస్ట్‌ కోసం వేచి చూడాల్సిందే!

Varanasi Update

Varanasi Update

Varanasi Movie Completes Shooting: సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ఒకటి. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని ప్రకటించింది. దీంతో మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

వారణాసి షూటింగ్ పూర్తయిన విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సీజీ వర్క్స్ కొనసాగుతున్నాయి. రీరికార్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. డబ్బింగ్ ప్రారంభించాలి. ఇదే అప్డేట్ అనుకుంటే.. ఇదొక అప్డేట్. లేదంటే అసలైన బ్లాస్ట్‌ కోసం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే’ అంటూ పోస్ట్ చేసింది. ఈ అప్‌డేట్ సినీ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించడంతో ఇకపై సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రపంచంతో పాటు కాలాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథతో ‘వారణాసి’ తెరకెక్కుతోంది. ఇందులో మహేశ్ బాబు రుద్రగా, శ్రీరాముడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రను పోషిస్తున్నారు. కథ, పాత్రల విషయంలో రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాత్రల పరిచయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొనసాగుతుండగా.. త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి. వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.