సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిలబడతామని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదని నటుడు, నిర్మాత మాదాల రవి స్పష్టం చేశారు. సోమవారం ఫిలిం ఛాంబర్ సమక్షంలో, చిత్రపురి కమిటీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆధ్వర్యంలో నూతన ప్రాజెక్ట్ ‘సఫైర్ సూట్’ బ్రోచర్‌ను సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల ప్రతినిధులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాదాల రవి మాట్లాడుతూ, “చిత్రపురి సినీ పరిశ్రమలో అంతర్భాగం. ఇది కార్మికులకు ఉపయోగపడేలా, పరిశ్రమకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి. చిత్రపురిలో 9,000 మంది సభ్యులుండగా, దాదాపు 5,000 మందికి ఇప్పటికే ఇండ్లు కేటాయించారు. మిగిలిన వారికి కొత్త ప్రాజెక్ట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న నిజమైన కార్మికులకు న్యాయం చేయాలి, ఆ తర్వాత కొత్త సభ్యులకు అవకాశం కల్పించాలి. చిత్రపురి కమిటీ ఆదర్శవంతంగా నిలిచి, సభ్యులకు, కార్మికులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాము” అన్నారు. “‘సఫైర్ సూట్’ ప్రాజెక్ట్ ద్వారా చిత్రపురిలోని 9,000 మంది సభ్యులకు, కార్మికులకు మంచి జరగాలనే లక్ష్యంతో ఫిలిం ఛాంబర్ పెద్దలందరూ ఏకతాటిపైకి వచ్చి సహకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా కార్మికులకు ఉపయోగపడాలి. ప్రస్తుతం 4,500 మంది సభ్యులతో పాటు వెయిటింగ్ లిస్ట్‌లో ఎందరో ఉన్నారు. వారికి న్యాయం జరిగేలా, చిత్రపురి కమిటీ ఈ ప్రాజెక్ట్‌ను ఆదర్శవంతంగా నడిపించాలి. ఇటీవల మీడియాలో చిత్రపురిపై వచ్చిన వివాదాల నేపథ్యంలో, కమిటీ కార్మికులకు ఉపయోగపడేలా పారదర్శకంగా పనిచేయాలని కోరుకుంటున్నాము. చిత్రపురి కాలనీ సినీ పరిశ్రమలో ఒక కీలక భాగం. ఫిలిం ఛాంబర్ అన్ని విభాగాలను ఆహ్వానించిన సందర్భంలో, సభ్యులందరూ ఆనందంగా ఉండాలని, చిత్రపురి అందరికీ మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాము” అని అన్నారు.
