‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ‘డీసీ’ (DC) మూవీతో లీడ్ రోల్ పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామా ట్రైలర్ కేన్స్ వేదికగా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇందులో లోకేష్ కనగరాజ్ ‘దేవదాస్’ పాత్రలో, బ్యూటిఫుల్ వామికా గబ్బి ‘చంద్ర’ పాత్రలో కనిపించారు. ఈ ఇద్దరి పేర్ల (Devadas – Chandra) మొదటి అక్షరాలతోనే ఈ చిత్రానికి ‘DC’ అనే టైటిల్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్ ప్రకారం.. చిన్నతనంలోనే కోల్‌కతాలోని వ్యభిచార కూపంలోకి నెట్టబడిన చంద్ర అనే అమ్మాయి చుట్టూ కథ మొదలవుతుంది.
ఆమె అక్కడ ఒక డాక్టర్‌ను చంపి పరారీలో ఉండగా, మరోవైపు ఒక పోలీస్ ఆఫీసర్‌ను చంపిన నేరస్థుడిగా దేవదాస్ పరిచయమవుతాడు. సమాజం దృష్టిలో క్రిమినల్స్‌గా మారిన ఈ ఇద్దరి మధ్య చిగురించిన విలక్షణమైన ప్రేమ, వీరిని పట్టుకోవడానికి పోలీసులు వేసిన వల, ఈ ప్రయాణంలో వచ్చే బాంబు పేలుళ్లు, యాక్షన్ సీక్వెన్సులు ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ట్రైలర్ ముగింపులో సూర్యాస్తమయం వేళ ఒక కొండపై ఈ జంట నిలబడే విజువల్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.
