NTV Telugu Site icon

‘వకీల్ సాబ్’ నిర్మాతకు లీగల్ నోటీసు!

Legal Notice to Vakeel Saab Producer Dil Raju

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మొన్నటి వరకూ థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విశేష ఆదరణను అందుకుంటోంది. కరోనాకు భయపడి గడప దాటలేకపోతున్న ఆడపడుచుల కోసం నిర్మాత ‘దిల్’ రాజు కేవలం మూడు వారాల వ్యవధిలోనే ‘వకీల్ సాబ్’ను వారి ఇంట్లోకి చేర్చేశాడు. ఈ సినిమాను తమ హోమ్ థియేటర్ లో చూస్తూ ఎంజాయ్ చేసినట్టుగా ఇందులో కీలక పాత్రలు పోషించిన అంజలి, నివేదా థామస్ సైతం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. ఇదిలా ఉంటే… ఈ సినిమా విడుదలైన దాదాపు నాలుగు వారాల తర్వాత నిర్మాతకు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. సుధాకర్ అనే వ్యక్తి ఈ సినిమాలో తన ఫోన్ నంబర్ ను తన అనుమతి లేకుండా స్క్రీన్ మీద చూపించారని, దాంతో చాలా మంది తనకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇదే విషయమై ఇప్పటికే బాధితుడి తరఫున లాయర్ నిర్మాతలకు లీగల్ నోటీసులు సైతం జారీ చేశారట. మరి ‘వకీల్ సాబ్’ నిర్మాతలు ఈ వ్యవహారానికి కోర్టు బయటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటారేమో చూడాలి.