ప్రజల్లో రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హాజరై, తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆలోచింపజేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, తన అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడని భావోద్వేగంగా చెప్పారు. “అప్పటి వరకు నాకు ఎలాంటి సీరియస్‌నెస్ లేదు. ట్రాఫిక్ రూల్స్‌ను కూడా పాటించేవాడిని కాదు. కానీ ఆ ఒక్క సంఘటన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను” అని వివరించారు. ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ‘ఇంటికి క్షేమంగా చేరాలి, నాకంటూ కుటుంబం ఉంది, వారికి నా అవసరం ఉంది’ అని ఆలోచిస్తూ స్టీరింగ్ పట్టుకుంటానని అన్నారు.
Also Read:Pani puri: “పానీపూరీ” ఎంత పని చేసింది.. రోడ్డుపై మహిళ నిరసన.. వీడియో వైరల్..
యువత పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించిన కిరణ్, “యువకులు ఎక్కువగా రూల్స్‌ను పాటించరు. మీ సరదా కోసం, మీ ఎంజాయ్‌మెంట్ కోసం ఇతరుల ప్రాణాలను బలి తీసుకోకండి” అని సూచించారు. నేటి యువతరం ‘ఒకరు చెప్తే మేము వినడం ఏంటి’ అని అనుకుంటారని, కానీ తమ ప్రాణాల కోసమైనా రూల్స్ పాటించాలని కోరారు. ఈ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ పోలీసులు రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కిరణ్ అబ్బవరం వంటి సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా యువతకు మరింత ప్రేరణనిస్తున్నారు.
