KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Reality

Reality

టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. ఓ వైపు యాక్టర్‌గా, మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో ఇప్పుడు దర్శకుడిగా మారాడు. హీరోగా కెరీర్ లో 13వ సినిమాలో నటిస్తున్న  సినిమాకు తానే స్వీయ దర్శకత్వం చేస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌‌ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా, హార్ట్ టచింగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ద్వారా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటిస్తూ క్రిస్మస్ రేసులో నిలిచింది. డిసెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరోవైపు డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ నటించిన ‘దాదా’తో పాటు కింగ్ నాగార్జున నటిస్తున్న కింగ్ 100 కూడా రిలీజ్ కాబోతున్నాయి.

ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సుధాకర్ చాగంటి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ‘జాయ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం దర్శకుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.