ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీం పాత్రలో అలరించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో ఇరగదీయనున్నాడట. ఈ సినిమాను రాజమౌళి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌కు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు కొరటాలతో సినిమా చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా ప్రకటించడమే కాదు, రిలీజ్ డేట్ కూడా ఒకేసారి వెల్లడించారు. 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.
గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని తారక్ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. కాగా ఇప్పుడు అభిమానుల చూపు కథానాయికపై పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమాకి ఎక్కువగా రూమర్ అవుతున్న పేరు బాలీవుడ్ బ్యూటీ ‘కియారా అద్వానీ’.. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో దర్శకుడు కొరటాల శివతో కలిసి పనిచేసింది ఈ భామ. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ జోడి బాగుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ 30వ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం అనుకున్నప్పుడు కూడా పూజా హెగ్డే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో నిలిచాయి. ప్రస్తుతం దర్శకుడిపై క్లారిటీ రావడంతో త్వరలోనే కథానాయికపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.