హిట్ ఫట్‌తో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. అందరి హీరోల కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. భారీ హిట్ విషయం పక్కన పెడితే ఎప్పటికప్పుడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే, నిర్మాతగా తన గట్స్ ఏంటో చూపిస్తున్నారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయ శాంతి లీడ్ రోల్‌ల్లో నటిస్తోంది.
ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్‌ల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ విజయ శాంతి గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.. ‘ చాలా వరకు సినిమాల్లో తండ్రీకొడుకులు పలు విషయాల్లో గొడవ పడడం, చివరకు ఒకటవడం చూశాం. కానీ మా సినిమాలో.. ఎంతో ప్రేమగా ఉండే తల్లి కొడుకు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనేదే కీలకం. దర్శకుడు ప్రదీప్ ఈ కథ చెప్పేటప్పుడు తల్లి పాత్రలో విజయశాంతి మేడమ్‌నే ఊహించుకున్నా నేను. ఆమెను విజయశాంతి గారు అని అనను. మనస్ఫూర్తిగా అమ్మ అనే పిలుస్తా. ఈ సినిమాతో అంతగా దగ్గరయ్యాం. ఈ మూవీకి స్ఫూర్తి ‘కర్తవ్యం’ ఆ సినిమాలోని వైజయంతి పాత్రకి అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది? అన్నే పాయింట్‌తో ఈ కథను డెవలప్ చేశాం. ఆమె ఈ చిత్రానికి ప్రధాన బలం. యాక్షన్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించింది’ అని తెలిపారు కళ్యాణ్ రామ్.