January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!

Diviki Diviki January 12 Vidudala

Diviki Diviki January 12 Vidudala

January 12 Vidudala First Song Out, విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో..’ అనేది ఉపశీర్షిక. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో అనిల్ తనదైన శైలిలో ప్రమోషన్లను ప్రారంభించారు.

ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేశ్, కృతి శెట్టితో ప్రత్యేకంగా ఓ రీల్ చేయించి.. త్వరలోనే మొదటి పాటను విడుదల చేయనున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు. తాజాగా చిత్రబృందం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తూ తొలి పాటను విడుదల చేసింది. ‘డివికి డివికి..’ అంటూ సాగే ఈ పాటలో వదినా, మరదళ్ల మధ్య సరదా సందడిని అద్భుతంగా చూపించారు. కీర్తి, కృతి తమ డ్యాన్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘మా హామీ నువ్వే.. శివగామి నువ్వే..’ అంటూ సాగే లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. మధుప్రియ, హరిప్రియ అలరించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.

విడుదలైన కొద్దిసేపటికే వికి డివికి పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కీర్తి సురేశ్, కృతి శెట్టి డ్యాన్స్.. పాటలోని లిరిక్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన గంటలోనే లక్షకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. దీంతో జనవరి 12 విడుదలపై అంచనాలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచడం ఖాయం. కీర్తి, కృతిలతో ప్రమోషన్స్ చేసిన అనిల్.. రాబోయే రోజుల్లో వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ను వాడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.