Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా ఆమె స్టేజ్ ఎక్కినప్పటి నుంచి దిగిపోయే వరకు తన మాటలతో, హావభావాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ముద్దుముద్దుగా ఆమె తెలుగులో మాట్లాడిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
మీరు చూపించే ప్రేమే మాకు బలం..
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “నమస్కారం.. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు కూడా మీరు ఇదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమే మేము రాత్రి పగలు కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది.. మీ జీవితానికి అర్థం ఏంటి? మీ ఐడెంటిటీ ఏంటి? అనేది కనుక్కోవడమే ఈ చిత్రం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే.. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా మీ అందరితో చాలా డీప్‌గా కనెక్ట్ అయి ఉంది. ఐ హోప్.. నేను మిమ్మల్ని ప్రౌడ్‌గా ఫీలయ్యేలా చేస్తాను” అని ఎమోషనల్ అయ్యారు.
రామ్ చరణ్ ఒక ‘జెమ్’.. బుచ్చిబాబు ‘రౌడీ’ డైరెక్టర్
సినిమా విశేషాల గురించి చెప్తూ.. “ఈ సినిమా రిలీజ్‌కు ముందే నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. రామ్ చరణ్ సార్‌తో వర్క్ చేసే అవకాశం ఇచ్చింది. హి ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ జెమ్ ఆఫ్ ఎ పర్ఫామర్. జై చరణ్! ఇక బుచ్చిబాబు సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్. ఆయన చాలా సాదాసీదాగా, సింపుల్‌గా కనిపిస్తారు కానీ ఆయనో రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ..). ప్రతి టేక్ తర్వాత ఆయన నన్ను ఇమిటేట్ చేస్తారు. ‘అదిరిపోయింది మా.. అదిరిపోయింది.. కానీ మళ్లీ ఒకసారి టేక్’ అంటారు. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్లీ ఇంకో టేక్ అడుగుతారన్నమాట. మా డీపీఐ రాండీ సార్, లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు, మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారు, ప్రవీణ్ సార్.. ఇలా ఎంటైర్ టీమ్ మీకోసం బెస్ట్ ఇచ్చారు” అని పేర్కొన్నారు.
స్టేజ్ పై ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ డైలాగ్!
యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు జాన్వీ. “తెలుగు ప్రేక్షకుల గురించి అమ్మ మీకు ఏం చెప్పేది?” అని యాంకర్ అడగ్గా.. “ఆడియన్స్ ఈజ్ గాడ్ (ప్రేక్షకులే దేవుడు).. అమ్మ నాకు ఎప్పుడూ ఇదే చెప్పేది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమ నాకు సర్వస్వం” అని జాన్వీ బదులిచ్చారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని ఇంద్రజ (అతిలోకసుందరి) ఐకానిక్ డైలాగ్‌ను స్టేజ్ పైన జాన్వీ కపూర్ రీ-క్రియేట్ చేశారు. స్క్రీన్ పై విజువల్స్ చూసిన అనంతరం జాన్వీ మైక్ అందుకుని.. “మానవా.. ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా..” అంటూ శ్రీదేవి స్టైల్లోనే డైలాగ్ చెప్పి అందరినీ మెప్పించారు. జాన్వీ నోట ఆ డైలాగ్ వినగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. మొత్తానికి ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ స్పీచ్, ఆమె అచ్చ తెలుగు ముచ్చట్లు అభిమానులను మస్త్ ఖుషీ చేశాయి.
