Vijay Deverakonda: అనౌన్స్‌మెంట్ రాగానే దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన కాంబినేషన్లలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లెక్కల మాస్టర్ సుకుమార్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ క్రేజీ కాంబోను అధికారికంగా ప్రకటించినప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే ప్రకటన వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఆ సినిమా ఊసే వినిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందా? లేక తెరవెనుక మారిన సమీకరణాల వల్ల ఈ ప్రాజెక్ట్ శాశ్వతంగా అటకెక్కినట్లేనా అన్న సందేహాలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఊపందుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లడానికి ప్రధాన కారణం సుకుమార్ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో సుకుమార్ ఇప్పుడు దేశంలోనే టాప్ పాన్-ఇండియా డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయారు. ఆయన మార్కెట్ పరిధి వందల కోట్లకు చేరింది. ఈ క్రమంలోనే సుకుమార్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ఖరారు చేసుకున్నారు. చరణ్ ప్రాజెక్ట్‌పైనే ప్రస్తుతం పూర్తి దృష్టి కేంద్రీకరించడంతో.. విజయ్ దేవరకొండతో అనుకున్న సినిమా ప్రాధాన్యత జాబితాలో వెనకబడిపోయిందనే టాక్ వినిపిస్తుంది. అగ్ర హీరోలతో వరుసగా భారీ చిత్రాలు లైనప్‌లో ఉండటంతో సమీప భవిష్యత్తులో విజయ్-సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం దాదాపు అసాధ్యమనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
మరోవైపు సుకుమార్ సినిమాపై స్పష్టత లేకపోయినా విజయ్ దేవరకొండ ఏమాత్రం ఖాళీగా లేరు. ‘టాక్సీవాలా’ తర్వాత ఆరేడేళ్లుగా సరైన సాలిడ్ హిట్ పడకపోయినా, ఆయన క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. దర్శకులు, నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికే అక్టోబర్ 16న రిలీజ్‌కు సిద్ధమైన ‘రణబాలి’ డబ్బింగ్ పూర్తి చేసిన రౌడీ హీరో, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్ధన్’ షూటింగ్ కోసం మంగళూరు సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘రౌడీ జనార్ధన్’ తర్వాత ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ చిత్రాన్ని విజయ్ లైన్‌లో పెట్టారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు విజయ్‌కి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత బన్నీ వాస్ మరో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. సుకుమార్ నుంచి ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో, విజయ్ కూడా తన ఫోకస్‌ను అందుబాటులో ఉన్న కథలు, యంగ్ డైరెక్టర్ల వైపే మళ్లించినట్లు తెలుస్తోంది. మొత్తానికి లెక్కల మాస్టర్ వేసిన కొత్త లెక్కల్లో విజయ్ దేవరకొండ సినిమా ఇప్పట్లో లేనట్టేనని, ఈ కాంబో దాదాపు అటకెక్కినట్లేనని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది.

