Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?

Irumudi: ఒక సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ సాధించడం పెద్ద విషయం కాదు. కానీ రెండో వారం మొదలైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం అరుదైన విషయం. ఇప్పుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ అదే చేస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాదు రెండో వారంలోనూ సినిమా ఆక్యుపెన్సీ, రోజువారీ వసూళ్లు పూర్తిగా పడిపోకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ జోరు ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? సెప్టెంబర్ 24న ‘ది పారడైజ్’ వచ్చే వరకు ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా ? అనే వివారాల్లోకి వెళ్తే..

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియ భవానీ శంకర్, బేబీ నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ పబ్లిసిటీతో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. ఫలితంగా మొదటి వారాంతం తర్వాత కూడా కలెక్షన్లలో పెద్దగా పతనం కనిపించలేదు. బాక్సాఫీస్ ట్రాకింగ్ ప్రకారం రెండో వారంలోకి వెళ్లిన తర్వాత కూడా ‘ఇరుముడి’కి మంచి హోల్డ్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ దాటినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా రెండో వారంలోనూ నిలబడటానికి ప్రధాన కారణాల్లో హాలిడే అడ్వాంటేజ్ ఒకటిగా కనిపిస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వచ్చే సెలవులు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకురావడానికి ఉపయోగపడే అవకాశం ఉంది.

మరోవైపు ఈ వారాంతంలో ‘ఇరుముడి’కి పోటీగా వచ్చే సినిమాలపై కూడా ట్రేడ్ దృష్టి పెట్టింది. ‘రంభ ఊర్వశి మేనక’, ‘రొమాంచకం’, ‘ఐ యామ్ గేమ్’ వంటి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నప్పటికీ, ప్రస్తుతం ‘ఇరుముడి’ సాధించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ వాటికి ఉందా అనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా పెద్ద స్టార్ హీరోల రిలీజ్ లు లేకపోవడం రవితేజ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారుతోంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, ‘ఇరుముడి’ ఆక్యుపెన్సీ మొదటి వారంతో పోలిస్తే తగ్గినప్పటికీ, పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్, మహిళలు, రిపీట్ ఆడియన్స్ సినిమాను నిలబెడుతున్నారని ట్రేడ్ విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇక మూడో వారాంతం కూడా ‘ఇరుముడి’కి కీలకం కానుంది. రెండో శనివారం, ఆదివారం తర్వాత వినాయక చవితి సెలవు కూడా రావడం సినిమాకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సెలవులను సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఈ వీకెండ్ కూడా కొనసాగిస్తే రూ.200 కోట్ల మైలురాయితో ఆగకుండా మరింత దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక సెప్టెంబర్ 24న నాని నటించిన ‘ది పారడైజ్’ థియేటర్లలోకి రానుంది. అప్పటివరకు పెద్దగా అడ్డంకులు లేకుండా ‘ఇరుముడి’ తన రన్‌ను కొనసాగించగలిగితే మరో భారీ రికార్డు వసూళ్లు అందుకునే అవకాశం ఉంటుంది. మరి ‘ఇరుముడి’ 300కోట్ల క్లబ్ లో చేరుతుందా? అనే టాపిక్ మీదే ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ హాట్ గాఆ చర్చ మొదలైంది.  పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ, ఫ్యామిలీ ఆడియన్స్, హాలిడే అడ్వాంటేజ్, పెద్ద పోటీ లేకపోవడం వంటి అంశాలు కలిసి ‘ఇరుముడి’కి లాంగ్ రన్‌ను అందిస్తున్నాయి. సెప్టెంబర్ 24 వరకు ‘ఇరుముడి’ ఇంకెంత వసూళ్లను సాధిస్తుందనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.