భారతీయ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరో అద్భుతమైన నిర్ణయంతో మ్యూజిక్ ప్రియుల మనసు గెలుచుకుంటున్నారు. తన కుమార్తె భవతారణి స్మారకార్థంగా కొత్తగా ‘భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా’ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆర్కెస్ట్రా ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 15 ఏళ్లలోపు ఉన్న ప్రతిభావంతులైన చిన్నారులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఇళయరాజా ఈ ఆలోచనను కొంతకాలం క్రితం పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకువస్తూ అధికారికంగా ఆర్కెస్ట్రా ఏర్పాటు ప్రారంభించారు. సంగీతం పై మక్కువ, ప్రతిభ ఉన్న చిన్నారులకు ఇది జీవితాన్ని మార్చే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. గానం చేయగల చిన్నారులు, సంగీత వాయిద్యాల పై దిట్టగా ఉన్నవారు ఈ ఆర్కెస్ట్రాలో భాగమవ్వవచ్చు.
Also Read : Ustad-bhagat-singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ రెడీ – ఫస్ట్ సింగిల్ కౌంట్‌డౌన్ స్టార్ట్!
ఇళయరాజా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ, ఆసక్తి కలిగిన వారు తమ పేరు, వయస్సు, సంగీత అనుభవం, ఫోన్ నెంబర్, ఇతర వివరాలను allgirlsorchestra@gmail.com చిరునామాకు పంపాలని సూచించారు. ఎంపికైన చిన్నారులు ఇళయరాజా సారథ్యంలో ప్రాక్టీస్ చేస్తూ, భవిష్యత్తులో లైవ్ మ్యూజిక్ కచేరీలలో పాల్గొనే అవకాశం పొందుతారు. ఈ ఆర్కెస్ట్రాకు ఇళయరాజా తన కుమార్తె భవతారణి పేరు పెట్టడం వెనుక ఉన్న భావోద్వేగం అందరినీ కదిలిస్తోంది. భవతారణి గాయని, సంగీత దర్శకురాలిగా తమిళ సినిమాల్లో అనేక హిట్ పాటలు అందించారు. కానీ గత సంవత్సరం జనవరి 24న క్యాన్సర్‌తో ఆమె మృతి చెందడం సంగీత ప్రపంచానికి పెద్ద నష్టం. ఆమె స్మారకార్థంగా ఇళయరాజా చేపట్టిన ఈ “భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా” సంగీత రంగంలో చిన్నారులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇది కొత్త తరానికి స్ఫూర్తినిచ్చే సంగీత యాత్ర గా నిలవనుంది.
