కేంద్ర ప్రభుత్వం త్వరలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952లో సవరణలు తీసుకు రాబోతోంది. గడిచిన 12 సంవత్సరాలలో ప్రముఖ దర్శక నిర్మాత శ్యామ్ బెనగల్, జస్టిస్ ముకుల్ ముద్గల్ తో కేంద్రం రెండు కమిటీలను వేసింది. ఆ కమిటీలు ఇచ్చిన సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2021 ముసాయిదాను తయారు చేసింది. దీనిని ప్రజలకు అందిస్తూ, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయమని, సవరణలు, సూచనలు ఇవ్వమని కోరింది.
ఈ కొత్త చట్టంలోని కొన్ని అంశాలపై సినీ ప్రముఖులు కొందరు కన్నెర చేస్తున్నారు. ఇలాంటి చట్టం తీసుకురావడం స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించడమేనని మండిపడుతున్నారు. కేంద్రం కోరిన సవరణలు ఇవ్వడానికి ఇవాళే చివరి రోజు కాబట్టి, దీనిని అధ్యయనం చేసి కొందరు ప్రముఖులు తయారు చేసిన సూచనలు, సలహాలకు మద్దత్తు ఇవ్వమంటూ సూర్య సోషల్ మీడియా వేదికగా ఓ విజ్ఞాపన పత్రాన్ని జత చేశారు. తాము సూచించిన సవరణల పట్ల సుముఖంగా ఉండేవారు… దానిని బలపరచమని కోరారు. నిజానికి గత కొంతకాలంగా కేంద్రం చేయబోతున్న కొత్త చట్టంపై సినిమా రంగంలోని బీజేపీ వ్యతిరేకులు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు.
read also : రణబీర్ మిస్ అయ్యాడు! రణవీర్, హృతిక్, అర్జున్ హిట్ అయ్యారు!
కమల్ హాసన్ అయితే జనవరిలోనే ‘సినిమా, మీడియా, లిటరేచర్ అనే మూడు… కళ్ళు, చెవులు, నోరు మూసుకునే కోతులు కాదు. స్వేచ్ఛా, స్వాంతంత్రాల కోసం ప్రజలు తమ అభ్యంతరాలను తెలియచేయాల్సిందే’ అంటూ ఇన్ డైరెక్ట్ గా ఈ చట్టంను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇవాళ సూర్య సైతం ఈ కొత్త చట్టం చాలా దారుణంగా ఉందనే భావనను వెలిబుచ్చుతూ, ‘భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటమే చట్టం. దాని స్వరతంత్రులను గొంతు కోసి చంపడం కాదు’ అని చాలా పరుషమైన పదజాలాన్నే వాడారు. సూర్య వెలిబుచ్చిన అభిప్రాయలతోనూ సినీ ప్రముఖులు గౌతమ్ వాసుదేవ మీనన్, కార్తీక్ సుబ్బరాజు వంటి వారు ఏకీభవిస్తూ, కేంద్రం చేయబోతున్న చట్టం సరైనది కాదని అన్నారు.
ఒకసారి సెన్సార్ చేసిన సినిమాలను రీ సెన్సార్, రీ ఎగ్జామిన్ చేసే అధికారాన్ని కేంద్రం తీసుకోవడం మీద చాలా మంది సినిమా ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ ఎగ్జామిన్ కమిటీ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్ళేవాడు. అక్కడ కూడా అతనికి న్యాయం దక్కకపోతే రీ-రివైజింగ్ కమిటీని ఆశ్రయించే వాడు. అక్కడా తనకు చుక్కెదురైతే, న్యూ ఢిల్లీలోని ట్రిబ్యునల్ గడప తొక్కే వాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ట్రిబ్యునల్ ను రద్దు చేసింది. నిర్మాత తనకు రీ-రివైజింగ్ కమిటీలో న్యాయం జరగలేదని భావిస్తే రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించవచ్చని చెప్పింది.
ఇలా చేయడం ద్వారా కేంద్రం నిర్మాతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అలానే సినిమాను ఎగ్జామిన్ చేసే అధికారులకు కేవలం ఏ సర్టిఫికెట్ ఇవ్వాలో చెప్పే అధికారమే ఉండాలి కానీ సలహాలు, సూచనలు ఇవ్వడం… అభ్యంతరకర సన్నివేశాలకు కత్తెర వేయమనడం వంటివి అప్పచెప్పకూడదని కోరుతున్నారు. భావప్రకటన స్వేచ్ఛకు ముకుతాడు వేయవద్దంటున్న వీరికి మద్దత్తుగా ఇంకెంత మంది గొంతు కలుపుతారో, ఈ నిరసన జ్వాలలను కేంద్రం ఎలా చల్లబరుస్తుందో వేచి చూడాలి.
