Site icon NTV Telugu

సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న సిద్ధార్థ్ ట్వీట్!

Hero Siddharth Tweet Goes viral on Corona

సామాజికాంశాల విషయమై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం మొదటి నుండి హీరో సిద్ధార్థ్ కు అలవాటు. దాంతో కొన్నిసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. అయినా ఆ అలవాటు మార్చుకునే ప్రయత్నం సిద్ధార్థ్ ఎప్పడూ చేయలేదు. తాజాగా సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశం అట్టుడిపోతుంటే ప్రభుత్వాలు పెద్దంతగా పట్టించుకోవడం లేదని సిద్ధార్థ్ భావిస్తున్నాడు. ఇదే సమయంలో ఈ విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన సెలబ్రిటీస్ సైతం మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని అతను అభిప్రాయ పడుతున్నాడు. ‘మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు నిశ్శబ్దంగా కళ్ల ముందు జరుగుతున్న హారర్ షోను చూస్తున్నార’ని వ్యాఖ్యానించిన సిద్ధార్థ్‌… అందుకు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ప్రజలు ఈ విషయమై మాట్లాడాలని, ప్రభుత్వాలని ప్రశ్నించాలని కోరాడు. ప్రజారోగ్యం విషయమై ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని అన్నాడు. అప్పుడే ఈ పరిస్థితుల నుండి బయటపడగలమని, ప్రజలు కళ్ళు తెరవాలని ట్వీట్ చేశాడు. స్టార్ హీరోలను ఉద్దేశించే సిదార్థ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కొందరంటుంటే, మొదటి నుండి సిద్ధార్థ్ యాంటీ బీజేపీ అని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ఇలా వ్యాఖ్యానించాడని మరికొందరు అంటున్నారు. నెటిజన్లు మాత్రం యాంటీ సిద్ధార్థ్, ప్రో సిద్ధార్థ్ గా మారిపోయారు. ఇలాంటి సమయంలో ప్రజలను రెచ్చగొట్టడం సమంజసం కాదని కొందరు అంటుంటే… ప్రశ్నించకపోతే ప్రభుత్వాలు పనులు ఎలా చేస్తాయని మరి కొందరంటున్నారు. మొత్తానికి సిద్దార్థ్ ట్వీట్ చినికి చినికి గాలివానగా మారేట్టు ఉంది.

Exit mobile version