Hanuman Ansh: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!

Hanuman Ansh Telugu Trailer

Hanuman Ansh Telugu Trailer

Hanuman Ansh: భారతీయ చిత్రసీమలో కంటెంట్ ఉన్న ఆధ్యాత్మిక చిత్రాలకు తిరుగులేదని నిరూపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ మరో సంచలనానికి తెరతీసింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సెన్సేషన్ సృష్టించిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, భక్తులు ప్రేమగా ‘మహారాజ్-జీ’ అని కొలిచే ‘నీమ్ కరోలి బాబా’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై దక్షిణాదిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి పాన్-ఇండియా హిట్స్ అందించిన హోంబలే ఫిల్మ్స్ కేవలం భారీ సినిమాలకే పరిమితం కాకుండా, విశిష్టమైన ఆధ్యాత్మిక కథలను వెలుగులోకి తేవడంలో ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన హోంబలే సంస్థ, ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ భాషల (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) థియేట్రికల్ రైట్స్‌ను చేజిక్కించుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

హిందీలో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. తాజాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. నీమ్ కరోలి బాబా జీవితంలోని కీలక మలుపులు, ఆయన చేసిన అద్భుతాలు, ఆధ్యాత్మిక పరివర్తనను అత్యంత సహజంగా, భావోద్వేగభరితంగా ఇందులో ఆవిష్కరించారు. బాబా పాత్రలో శోబినావ్ సత్యా పరకాయ ప్రవేశం చేయగా.. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తమ పాత్రలతో ప్రాణం పోశారు. దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది టేకింగ్, శ్రేయాస్ ధర్మాధికారి, రిషి పాఠక్ అందించిన దివ్యమైన సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను సైతం ప్రభావితం చేసిన నీమ్ కరోలి బాబా తత్వం.. భాషల సరిహద్దులు లేని విశ్వజనీనమైనది. అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.