Site icon NTV Telugu

Cinema 2025: నెట్‌లో ఎక్కువగా వెతికిన ‘టాప్ 10’ సినిమాలివే.. తెలుగులో ఒకటే!

Theatres

ప్రతి ఏటా గూగుల్ సంస్థ వివిధ విభాగాల్లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాల జాబితాను విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే 2025వ సంవత్సరానికి సంబంధించి భారతీయ సినిమా రంగం నుండి అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ ‘టాప్ 10’ సినిమాల లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, కొన్ని చిన్న సినిమాలు కూడా అనూహ్యంగా చోటు సంపాదించుకున్నాయి.

1. సయారా
ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘సయారా’ సినిమా ప్రథమ స్థానంలో నిలిచింది. అహన్ పాండే, అనీత్ పత్తా నటించిన ఈ చిత్రం అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారి సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కింది. ఈ ‘ఫీల్ గుడ్’ మూవీ ఆన్‌లైన్‌లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

2. కాంతార 2
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార 2’ సెకండ్ ప్లేస్ కొట్టేసింది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌తో గూగుల్‌లో భారీగా వెతకబడింది.

3. కూలీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ మూడవ స్థానంలో నిలిచింది. నాగార్జున, అమీర్ ఖాన్ వంటి భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు.

4. వార్ 2
హృతిక్ రోషన్ మరియు మన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ‘వార్ 2’ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

5. సనమ్ తేరీ కసమ్
2016 నాటి క్లాసిక్ లవ్ స్టోరీ ‘సనమ్ తేరీ కసమ్’ మళ్ళీ రీ-రిలీజ్ కావడంతో ఈ ఏడాది గూగుల్‌లో ట్రెండ్ అయ్యింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ఐదవ స్థానంలో నిలిచి, తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

6. మార్కో
ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో వచ్చిన మలయాళ యాక్షన్ మూవీ ‘మార్కో’. 2024 చివర్లో విడుదలైనప్పటికీ, 2025లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ వల్ల ఆరవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

7. హౌస్‌ఫుల్ 5
అక్షయ్ కుమార్ బ్రాండ్ కామెడీ సిరీస్ ‘హౌస్‌ఫుల్ 5’ ఏడవ స్థానంలో నిలిచింది. భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకర్షించింది.

8. గేమ్ ఛేంజర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ ఈ లిస్ట్‌లో ఎనిమిదవ స్థానాన్ని పొందింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించింది.

9. మిసెస్ (Mrs.)
మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ చిత్రానికి హిందీ రీమేక్‌గా వచ్చిన ‘మిసెస్’ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. సాన్యా మల్హోత్రా నటనకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

10. మహావతార్ నరసింహ
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ టాప్ 10లో నిలిచింది. కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Exit mobile version