బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై’ అనే బుక్ ఆధారంగా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది? అనేదే సినిమా ప్రధానాంశం.
ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్, టీజర్ విడుదలై విశేష స్పందన రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే… వచ్చే సంవత్సరం జరుగబోతున్న 72వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘గంగూబాయి కతియావాడి’ అధికారికంగా ఎంపికైంది. ఈ విషయాన్ని అలియాభట్ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేస్తూ, హర్షం వ్యక్తం చేసింది.
