Site icon NTV Telugu

FNCC : దిల్ రాజుకు సత్కారం

Fncc Dil Raju

Fncc Dil Raju

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో ఉగాది పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, ఉపాధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా, కల్చరల్ కమిటీ చైర్మన్ ఎ. గోపాలరావు, అడిషనల్ చైర్మన్ సురేష్ కొండేటి, కమిటీ సభ్యులు పద్మజ, శివలతో కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజును విశేషంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేఎల్ నారాయణ, మాజీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డా. కె. వేంకటేశ్వరరావు, గత కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు మాట్లాడుతూ, “ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరం. ఈ రోజు దిల్ రాజు గారిని సత్కరించడం ఆనందంగా ఉంది. ఆయన చిన్న సినిమాల నుంచి భారీ చిత్రాల వరకు నిర్మిస్తూ సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. థియేటర్ల నిర్మాణం, సినిమాల పంపిణీ, ప్రదర్శన ద్వారా సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రశంసనీయం. ఎఫ్‌ఎన్‌సీసీ లీజ్ మరో మూడేళ్లలో ముగియనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి దీన్ని పొడిగించాలని ఆశిస్తున్నాం. సీఎం గారు కూడా మన క్లబ్ సభ్యుడే. అలాగే, ఆయన ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాలతో ఫిల్మ్ సిటీ నిర్మిస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. దిల్ రాజు గారు ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చించి సాధించాలని కోరుతున్నా” అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, “ఎఫ్‌ఎన్‌సీసీ మనకు అత్యుత్తమ క్లబ్. నగర మధ్యలో ఉంటూ వ్యాయామం, వినోదం కోసం ఎంతో ఉపయోగపడుతోంది. నేను 1996లో ఈ క్లబ్ సభ్యత్వం తీసుకున్నాను. గత 30 ఏళ్లలో ఇది ఎంతో అభివృద్ధి చెందింది. దీనికి కేఎల్ నారాయణ, కేఎస్ రామారావు, వారి కమిటీ సభ్యులు ఎంతో కృషి చేశారు. ఎఫ్‌ఎన్‌సీసీ లీజ్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇది చిన్న విషయం, సులభంగా ఆమోదం పొందుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు. ఫిల్మ్ సిటీ ప్రతిపాదనను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాను” అని తెలిపారు.

Exit mobile version