‘అభిమానవంతులు’ చిత్రం ద్వారా శోభానాయుడు, ఫటాఫట్ జయలక్ష్మి ని పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి చెన్నయ్ లో బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. మార్చి 8వ తేదీ 1948లో నెల్లూరు జిల్లా గూడురులో ఆయన జన్మించారు. శ్రీమతి మస్తానమ్మ, ఎం. సుబ్బరామరెడ్డి వారి తల్లిదండ్రులు. మైసూరు విశ్వ విద్యాలయంలో బి.ఇ. పూర్తి చేసిన తర్వాత కొంతకాలం సిమెంట్ రేకుల వ్యాపారం నిర్వహించిన రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత తన బంధువైన ఎం.ఎస్. రెడ్డి ప్రోత్సాహంతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత ‘అభిమానవంతులు’ (1973), ‘వైకుంఠపాళి, గడుసుపిల్లోడు, సీతాపతి సంసారం, మావూరి దేవత, అల్లుడుగారు జిందాబాద్, అగ్ని కెరటాలు చిత్రాలతో పాటు వాకాడ అప్పారావుతో కలిసి ‘మూడిళ్ళ ముచ్చట’ ను నిర్మించారు. అమ్మోరుతల్లి చిత్రాన్ని డబ్ చేశారు. ఎం. రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
