మలయాళ చిత్రపరిశ్రమను కుదిపేస్తున్న వివాదాలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాలపై గొంతు విప్పుతుండగా.. తాజాగా బ్లాక్‌బస్టర్ సిరీస్ ‘దృశ్యం’ (Drishyam) ఫేమ్ నటి అన్సీబా హాసన్ (Ansiba Hassan) చేసిన సంచలన వ్యాఖ్యలు కోలీవుడ్, మాలీవుడ్‌లలో పెను దుమారం రేపుతున్నాయి.
సూపర్ స్టార్ మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో వచ్చిన ‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’ సినిమాలలో ఆయన పెద్ద కుమార్తె ‘అంజు జార్జ్’ పాత్రలో అన్సీబా హాసన్ అద్భుతమైన నటన కనబరిచారు. తెలుగులో ఈ పాత్రను కృతిక జయకుమార్ పోషించారు. అయితే, కొంతకాలంగా మలయాళ అసోసియేషన్ ‘అమ్మ’ యాక్టివిటీస్‌కు దూరంగా ఉంటున్న అన్సీబా.. ఇటీవలే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసోసియేషన్‌లో కొందరు సభ్యులు తనను మతపరంగా ఎలా టార్గెట్ చేశారో చెప్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు..
‘అసోసియేషన్‌కు చెందిన టామ్ (Tom) అనే వ్యక్తి నన్ను తీవ్రంగా వేధించేవాడు. నాపై పదే పదే ‘జిహాదీ’ అనే ముద్ర వేస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా నా మతాన్ని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు నా వ్యక్తిగత జీవితంపై లేనిపోని తప్పుడు రూమర్లను ఇండస్ట్రీలో వ్యాప్తి చేశాడు. అసోసియేషన్ పెద్దల నుండి తనకు ఎలాంటి మద్దతు లభించకపోవడంతోనే నేను రాజీనామా నిర్ణయం తీసుకున్న. అంతే కాదు ఈ విషయంలో నేను ఎలాంటి చట్టపరమైన లేదా పోలీస్ చర్యలు చేపట్టదలుచుకోలేదు. ఆ వేధింపులను భరించే శక్తి లేకే నేను ‘అమ్మ’ నుండి శాశ్వతంగా తప్పుకున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, వేధింపులపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో.. సాక్షాత్తు ‘దృశ్యం’ లాంటి పెద్ద సినిమాలో నటించిన హీరోయిన్‌కే మతం రంగు పులిమి వేధించారనే విషయం బయటకు రావడం సంచలనంగా మారింది. అన్సీబాకు మద్దతుగా పలువురు నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
