మలయాళ చిత్రం ‘దృశ్యం -2’ హిందీ రీమేక్ హక్కుల్ని కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ సొంతం చేసుకున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా మంగళవారం తెలియచేశారు. ‘దృశ్యం -2’ చిత్రాన్ని పేషన్ తోనూ, కమిట్ మెంట్ తోనూ తెరక్కించాలని, అవి తమకు ఉన్నాయని, తమ సొంత నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ ద్వారా దీనిని నిర్మిస్తామని అన్నారు. అయితే… గతంలో ‘దృశ్యం’ సినిమాను హిందీలో పనోరమా స్టూడియోస్ తో పాటు వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ కలిసి నిర్మించింది. కానీ ఇప్పుడు పనోరమా స్టూడియోస్ మాత్రమే దీని రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకోవడం కరెక్ట్ కాదని, తమను కూడా కలుపుకునే ఈ చిత్రాన్ని నిర్మించాలని వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ అధినేతలు మోకాలడ్డుతున్నారు. లీగల్ గా హిందీలో ‘దృశ్యం -2’ను నిర్మించే హక్కు తమకు కూడా ఉందన్నది వారి వాదన. తమను కాదని పనోరమా స్టూడియోస్ వేరెవరితో అయినా కలిసి ఆ సినిమాను హిందీలో నిర్మిస్తే ఊరుకునేదే లేదని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే కుమార్ మంగత్ కు లీగల్ నోటీసుకు కూడా పంపామని వైకామ్ సంస్థ చెబుతోంది. దీనిపై స్పందించడానికి కుమార్ మంగత్ నిరాకరించారు. ఇదిలా ఉంటే… 2015లో హిందీలో ‘దృశ్యం’ సినిమాను రీమేక్ చేసిన దర్శకుడు నిషికాంత్ కామత్ గత యేడాది అనారోగ్యంతో హైదరాబాద్ లోనే కన్నుమూశాడు. మరి ఇప్పుడీ ‘దృశ్యం-2’ హిందీ రీమేక్ ను డైరెక్ట్ చేసే బాధ్యత ఎవరికి అప్పగిస్తారన్నది కూడా ఓ ప్రశ్నగా ఉంది. మలయాళ మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫ్ తెలుగు రీమేక్ నూ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి… అతనికే ఈ బాధ్యత కూడా అప్పగిస్తారేమో చూడాలి. ఎందుకంటే… పనోరమా స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ మంచి పనిచేస్తోందని జీతూ జోసఫ్ ఓ ప్రకటనలో హర్షం వెలిబుచ్చాడు.
చట్టపరమైన ఇబ్బందుల్లో ‘దృశ్యం -2’ హిందీ రీమేక్!
