Rajkumar Periasamy: ‘ఓం’ సినిమాలో ఆ సందేశం ఉండదు.. రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌కుమార్‌!

Rajkumar Periasamy Dhanush Om

Rajkumar Periasamy Dhanush Om

Rajkumar Periasamy on Dhanush Political Message in OM: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం ‘ఓం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే ప్రచారం ఇటీవల జోరందుకున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఓంలో రాజకీయ సందేశం ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి స్పష్టత ఇచ్చారు. ఈ సినిమాతో ఎలాంటి రాజకీయ సందేశం ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఓం ఒక అండర్‌కవర్ ఎమోషనల్ డ్రామా అని స్పష్టం చేశారు. కేవలం స్పై థ్రిల్లర్ మాత్రమే కాదని, ఇందులో భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశామని రాజ్‌కుమార్‌ తెలిపారు.

రాజకీయ సందేశం ఉండదు:


ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ.. ‘ఓం ఒక అండర్‌కవర్ ఎమోషనల్ డ్రామా. ఇందులో రెండు జానర్లు కలిసుంటాయి. కథలో ఉత్కంఠతో పాటు భావోద్వేగాలను కూడా ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు’ అని చెప్పారు. ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు ఇటీవల మరింత పెరిగాయి. ఆయన తన అభిమాన సంఘాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ధనుష్ అభిమాన సంఘం పేరును ‘ధనుష్ వెల్ఫేర్ మూవ్‌మెంట్’గా మార్చడం కూడా రాజకీయ ప్రవేశంపై చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఓం సినిమాలో రాజకీయ సందేశం ఉందా? అని దర్శకుడిని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. దీంతో ధనుష్ రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి, ఈ సినిమా కథాంశానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

ప్రేక్షకులకు గుర్తుండిపోయే మూవీ:
ఓం చిత్రంలో ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నటీనటులు కేవలం స్టార్ ఇమేజ్ కోసం సినిమాలో భాగం కాలేదని, కథకు మరింత లోతు తీసుకురావడమే వారి పాత్రల ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. ‘వారందరూ అద్భుతమైన నటులు. కథనాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వారు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. వారి నటన పాత్రలకు అవసరమైన లోతు, కొత్త కోణాలను అందిస్తుంది’ అని పేర్కొన్నారు. పెరియసామికి కూడా ఓం ప్రత్యేకమైన సినిమా. ఆయన దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో 2017లో ‘రంగూన్’, 2024లో ‘అమరన్’ చిత్రాలను తెరకెక్కించారు. ‘నా కెరీర్‌లో ఇది మూడో సినిమా. ఓం ప్రేక్షకులకు గుర్తుండిపోయే, వినోదాన్ని అందించే చిత్రంగా నిలుస్తుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

తమిళ సినిమాకు మంచివే:
తమిళ చిత్ర పరిశ్రమలో ఉదయం 6 గంటలకే ప్రత్యేక షోలు ప్రదర్శించే ట్రెండ్‌పైనా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి స్పందించారు. తెల్లవారుజామున 6 గంటల షోలు తమిళ సినిమాకు మంచివేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల పెద్ద సినిమాల విడుదల సందర్భంగా ఈ తరహా షోలు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఈ మూవీని శ్రద్ధా అగర్వాల్, అజ్మత్‌ జగ్మగ్‌తో కలిసి ధనుష్‌ నిర్మించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెలుగులో రిలీజ్ అయింది.