కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ తన రెండో సినిమాను తాజాగా ప్రారంభించారు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (తమిళ డబ్బింగ్) చిత్రంతో హీరోగా పరిచయమైన పవీష్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రంలో పవీష్ సరసన కథానాయికగా తెలుగు యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటిస్తుండటం విశేషం. తన జానపద పాటల ద్వారా యూట్యూబ్‌లో విశేష ప్రజాదరణ పొందిన నాగదుర్గ, ఈ సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.
Also Read : OTT: ఓటీటీలూ చేతులెత్తేశాయ్
తెలుగులో ఆమె ఇప్పటికే కలివి వనం అనే సినిమాలో నటించారు కానీ ఆ సినిమా వచ్చినట్టు కూడా పెద్దగా జనానికి తెలియదు. ఇక పవీష్ సినిమాతో మగేష్ రాజేంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన గతంలో తమిళంలో లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కిన విజయవంతమైన ‘బోగన్’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. ‘బోగన్’ వంటి హిట్ చిత్రానికి పనిచేసిన అనుభవంతో, మగేష్ రాజేంద్రన్ ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం అనంతరం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.
