NTV Telugu Site icon

Devadas Kanakala : నటశిక్షణతో కళకళలాడించిన దేవదాస్ కనకాల!

Devadas Kanakala

Devadas Kanakala

Devadas  Kanakala Birth Anniversary NTV Special Story.

నటునిగా, దర్శకునిగా, కథకునిగా దేవదాస్ కనకాల తనదైన బాణీ పలికించారు. వీటన్నిటికన్నా మిన్నగా ఎంతోమంది నటీనటులను తన శిక్షణతో తీర్చిదిద్దారు దేవదాస్. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ దేవదాస్ శిక్షణలో రాటుదేలిన వారే రాణిస్తూ ఉన్నారు. అంటే టాలీవుడ్ దేవదాస్ నటశిక్షణతోనే కళకళలాడుతూ ఉందన్నమాట! ఈ నాటికీ తెలుగునాట ‘నటశిక్షణ’ గురించి చర్చ సాగినప్పుడు తప్పకుండా సినీజనం దేవదాస్ కనకాలను గుర్తు చేసుకోకమానరు.

దేవదాస్ కనకాల 1945 జూలై 30న యానాం శివారులోని కనకాల పేటలో జన్మించారు. దేవదాస్ కు చిన్నతనం నుంచీ నాటకాలంటే పిచ్చి. ముఖ్యంగా ‘కన్యాశుల్కం’ నాటకమంటే ఎంతో అభిమానం. దానిని ఎవరు ఎక్కడ ప్రదర్శిస్తున్నా వెళ్ళి చూసేవారు. నటీనటులు ఇలా చేసి ఉంటే బాగుండేదే, అలా నటించి ఉంటే ఆకట్టుకొనేవారే అంటూ విశ్లేషించేవారు. ఆ రోజుల్లో ఆయనకు ఆదుర్తి సుబ్బారావు అభిమాన దర్శకుడు. ఆయన రూపొందించిన చిత్రాల కథల్లోని వైవిధ్యం, పాటల చిత్రీకరణ దేవదాస్ కు ఎంతగానో నచ్చేవి. ఓ సారి అతి ప్రయాసమీద ఆదుర్తిని కలుసుకున్నారు. ఆయన సలహా మేరకు నటనలో శిక్షణ పొందాలని నిర్ణయించి, పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి నటునిగా శిక్షణ పొందారు. అక్కడ నుండి రాగానే మళ్ళీ ఆదుర్తిని కలిశారు. అప్పుడు ఆదుర్తికి దేవదాస్ లోని పట్టుదల ఎంతగానో నచ్చింది. ఏయన్నార్, ఆదుర్తి కలసి ‘చక్రవర్తి చిత్ర’ అనే సంస్థను నెలకొల్పి, అభ్యుదయ భావాలతో చిత్రాలు నిర్మించారు. వారు నిర్మించిన ‘సుడిగుండాలు, మరో ప్రపంచం’లో దేవదాస్ కు చిన్న వేషాలు దక్కాయి. తరువాత ఏయన్నార్ తో బాపు తెరకెక్కించిన ‘బుద్ధిమంతుడు’లో దేవదాస్ హీరోకు స్నేహితునిగా నటించారు. దేవదాస్ లోని ఈజ్ ను కె.విశ్వనాథ్ పసిగట్టారు. ఆదుర్తి వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసి, తరువాత డైరెక్టర్ అయ్యారు కె.విశ్వనాథ్. అందువల్ల తమ గురువు రూపొందించే చిత్రాలను విశ్వనాథ్ పరిశీలిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో విశ్వనాథ్ దృష్టిని దేవదాస్ ఆకర్షించారు. తాను తెరకెక్కించిన ‘ఓ సీత కథ’లో దేవదాస్ కు కీలక పాత్రను ఇచ్చారు విశ్వనాథ్. ఆ సినిమాతో దేవదాస్ నటనకు మంచి గుర్తింపు లభించింది. తరువాత విశ్వనాథ్ ‘ప్రేమబంధం, సిరిసిరిమువ్వ’ వంటి చిత్రాలలో దేవదాస్ నటించారు. ఆపై అనేక చిత్రాలలో దేవదాస్ గుర్తింపు ఉన్న పాత్రలే పోషించారు.

పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో విద్య నేర్వడం వల్ల దేవదాసు మనసు డైరెక్షన్ వైపుకూ మళ్ళింది. ‘చలిచీమలు’తో దర్శకునిగా మారారు. తరువాత ‘నాగమల్లి’ సినిమానూ రూపొందించారు. ‘చలిచీమలు’తోనే పరుచూరి సోదరుల్లో పెద్దవారయిన వెంకటేశ్వరరావు చిత్రసీమలో ప్రవేశించారు. ఇక ‘నాగమల్లి’కి దేవదాస్ వద్ద ఇ.వి.వి. సత్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. నాటకాలను పరిశీలించడమూ, అందులో ప్రతిభ కనబరచిన నటీనటులకు, రచయితలకూ అవకాశాలు కల్పిస్తూ సాగారు దేవదాస్. ఆయన దర్శకత్వంలో “నిజం, ఓ ఇంటి బాగోతం, పుణ్యభూమి కళ్ళు తెరిచింది” వంటి చిత్రాలు రూపొందాయి. అదే సమయంలో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి నెలకొల్పిన నటశిక్షణాలయంలో దేవదాస్ పనిచేశారు. అక్కడే ఆయన భార్య లక్ష్మి కూడా శిక్షణ ఇస్తూ ఉండేవారు. లక్ష్మి శిక్షణలో స్టార్స్ అనిపించుకున్నవారిలో రజనీకాంత్ ప్రముఖులు. ఇక వారిద్దరి వద్ద శిక్షణ అభ్యసించిన వారిలో చిరంజీవి, సుధాకర్, రాజేంద్రప్రసాద్, హరిప్రసాద్, భానుచందర్ వంటివారు ఉన్నారు. మద్రాసులో ఉండగా మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు దేవదాస్.

తరువాత ప్రముఖ దర్శకుడు వి.మధుసూదనరావు హైదరాబాద్ లో ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’ ఆరంభించినప్పుడు దేవదాస్ కనకాలను ప్రిన్సిపల్ గా ఆహ్వానించారు. ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’కు కొన్నేళ్ళు ప్రిన్సిపల్ గా పనిచేశారు దేవదాస్. ఆయన వద్ద నటశిక్షణ పొందిన వారిలో శ్రీకాంత్, శివాజీరాజా, శివసత్యనారాయణ వంటి వారు ఉన్నారు. ఓ వైపు నటశిక్షణ ఇస్తూనే, మరోవైపు తన దరికి చేరిన పాత్రల్లో నటించారు దేవదాస్. తరువాత దేవదాస్ దంపతులు సొంతగా మరో నటశిక్షణాలయం నెలకొల్పారు. అక్కడ అనేక మంది శిక్షణ పొంది ప్రస్తుతం చిత్రసీమలోనూ, బుల్లితెరపైనా, నటీనటులుగా, యాంకర్స్ గా రాణిస్తున్నారు. దేవదాస్, లక్ష్మి దంపతుల తనయుడు రాజీవ్ కనకాల కొన్ని చిత్రాలలో హీరోగా నటించినా, ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. రాజీవ్ భార్య సుమ నేడు స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. త్వరలోనే రాజీవ్ ,సుమ దంపతుల తనయుడు కూడా హీరోగా పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ఎంతోమంది నటీనటులకు శిక్షణ ఇచ్చిన దేవదాస్ దంపతుల్లో లక్ష్మి ముందుగా కన్నుమూశారు. ఆమె కాలం చేసిన యేడాదికే 2019 ఆగస్టు 2న దేవదాస్ కూడా తుదిశ్వాస విడిచారు. వారి స్ఫూర్తితో ఇప్పటికీ ఎన్నో నటశిక్షణాలయాలు వెలుస్తూనే ఉన్నాయి. నటులకు శిక్షణ అన్న మాట వినిపించిన ప్రతీసారి తెలుగునేలపై ఈ దంపతుల పేర్లు కూడా వినవస్తుంటాయి.