Site icon NTV Telugu

‘పఠాన్’ కోసం… దేసీ ఫైట్స్! విదేసీ ఫైట్ మాస్టర్స్!

‘పఠాన్’ సినిమా రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ‘జీరో’ అట్టర్ ఫ్లాప్ అయ్యాక షారుఖ్ పూర్తిగా తెరమరుగయ్యాడు. అయితే, ఆయన విధించుకున్న సెల్ఫ్ క్వారంటైన్ ‘పఠాన్’ రిలీజ్ తో ముగియనుంది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. అయితే, కింగ్ ఖాన్ రి ఎంట్రీ మూవీగా ప్రచారం అవుతోన్న ‘పఠాన్’ అనేక విధాలుగా ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతోంది. నిర్మాత ఆదిత్య చోప్రా ఓ రేంజ్ లో మెరుగులు దిద్దుతున్నాడు. తాజాగా నలుగురు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యాడట…
‘పఠాన్’ చిత్రం గూఢచర్యం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్. మరీ ఇక స్టంట్స్, ఫైట్స్, ఛేజింగ్స్ గురించి చెప్పేదేముంది? హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిందే. లేదంటే బాలీవుడ్ బాద్షా కమ్ బ్యాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, నిర్మాత ఆది చోప్రా, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అంతర్జాతీయంగా పేరున్న ఫైట్ మాస్టర్స్ ని ముంబైకి రప్పించబోతున్నారని సమాచారం. నలుగురిలో ఒకరి పేరైతే ఇప్పటికే ఖరారైపోయింది. సౌత్ ఆఫ్రికన్ స్టంట్ డిజైనర్ క్రెయిగ్ మాక్ రీ తన టీమ్ తో ఇండియాకి చేరుకున్నాడట. త్వరలోనే షారుఖ్, జాన్ అబ్రహాం ఫేస్ ఆఫ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ షూట్ చేయనున్నారు. ‘మ్యాడ్ మ్యాక్స్, అవెంజర్స్, బ్లడ్ షాట్, వార్’ చిత్రాలకు క్రెయిగ్ గతంలో పని చేశాడు.
క్రెయిగ్ కాకుండా మరో ముగ్గురు యాక్షన్ డైరెక్టర్స్ త్వరలో ‘పఠాన్’ కోసం బరిలోకి దిగనున్నారు. అయితే, వారెవరు అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకరు ఇండియన్ అవ్వొచ్చు అంటున్నారు. మరో ఇద్దరు ఇతర దేశాల నుంచీ వచ్చే హైలీ టాలెంటెడ్ స్టంట్ మాస్టర్స్, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్స్ అయి ఉంటారట! నలుగురు యాక్షన్ కొరియగ్రాఫర్స్ తో రకరకాల సీక్వెన్సెస్ షూట్ చేయటం వల్ల యాక్షన్ థ్రిల్లర్ కి కొత్తదనం వస్తుందని ఆదిత్య చోప్రా భావిస్తున్నాడట. చూడాలి మరి, షారుఖ్ తో పాటూ దీపికా పదుకొణే, జాన్ అబ్రహాం, డింపుల్ కపాడియా, సల్మాన్… ఇలా చాలా మంది బిగ్ యాక్టర్స్ కనువిందు చేయనున్న ‘పఠాన్’ ఎలాంటి దుమారం రేపుతుందో!

Exit mobile version