యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదంతో తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. విభిన్నమైన టైటిల్‌తోనే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రీతం కస్తూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో విజయ్ రాజ్‌కుమార్ పాల్గొని తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ‘మెగాస్టార్’ చిరంజీవి తనపై చూపించిన నమ్మకం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చిరంజీవి గారి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చింది:
తన తొలి సినిమా ‘ఏం చేస్తున్నావ్’ విడుదలైన తర్వాత చిరంజీవికి అభిమానిగా ఓ చిన్న ట్రిబ్యూట్ ఇచ్చానని విజయ్ రాజ్‌కుమార్ తెలిపారు. ఆ ట్రిబ్యూట్ చిరంజీవి వరకు వెళ్లిందని, దాంతో ఆయన తనను అభినందిస్తూ ఓ చిన్న సందేశం పంపించారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఓ రోజు చిరంజీవి తన వాట్సాప్‌లో మైకేల్ జాక్సన్ మూన్‌వాక్ వీడియోను స్టేటస్‌గా పెట్టారని విజయ్ రాజ్‌కుమార్ చెప్పారు. ఆ సమయంలో తనకు ఓ ఆలోచన వచ్చిందని.. చిరంజీవి తన కాంటాక్ట్‌ను ‘విజయ్ రాజ్‌కుమార్ – హీరో’ అని సేవ్ చేసుకుని ఉంటారా? అని అనిపించిందన్నారు.
చిరంజీవి గారే నన్ను హీరోగా నమ్మారు:
‘చిరంజీవి గారే నన్ను ఒక హీరోగా నమ్ముతున్నప్పుడు.. నన్ను నేను ఎందుకు నమ్మకూడదు అనిపించింది. ఆయన పెట్టిన ఆ వాట్సాప్ స్టేటస్ నన్ను మళ్లీ కొత్తగా రీస్టార్ట్ అయ్యేలా ప్రేరేపించింది. చిరు గారు చూపించిన ఆ నమ్మకమే ఈరోజు నేను డెలులు చిత్రంతో మీ ముందుకు రావడానికి కారణం’ అంటూ విజయ్ రాజ్‌కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డెలులు మూవీ ఓ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. యువతరం నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
కుక్కకు పుట్టినవా నువ్వు:
ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న టీజర్.. ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. పాత్రల మధ్య చోటుచేసుకునే సరదా సంభాషణలు, కామెడీ సన్నివేశాలు టీజర్‌కు మంచి ఫన్ టచ్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా టీజర్‌లోని కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా అంటావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు’, ‘నువేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’, ‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’, ‘కుక్కకు పుట్టినవా నువ్వు’ వంటి డైలాగ్స్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఫన్, కామెడీ, యువతరానికి కనెక్ట్ అయ్యే అంశాలతో రూపొందిన డెలులు టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

