హైదరాబాద్, మే 1, 2025: ప్రముఖ తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. లాయర్ కిషన్ లాల్ చౌహాన్ దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో, విజయ్ దేవరకొండ ‘రెట్రో’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఆదివాసీ సముదాయాన్ని అవమానించినట్లు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నారు.
‘రెట్రో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చదువు ప్రాధాన్యతను వివరిస్తూ.. పాకిస్థాన్ టెర్రరిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. ”టెర్రరిస్ట్ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే.. ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారు. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు ఇలా బుద్ధి లేకుండా, కామెన్సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు” అని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ కామెంట్స్ పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
లాయర్ కిషన్ లాల్ చౌహాన్ తన ఫిర్యాదులో, ‘రెట్రో’ సినిమా ప్రచార కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆదివాసీ సముదాయాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆదివాసీల సంస్కృతి, జీవన విధానాన్ని అవమానకరంగా చిత్రీకరించాయని, ఇది సముదాయంలో ఆగ్రహానికి కారణమైందని ఆయన ఆరోపించారు.
ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి, ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్, సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులోని ఆరోపణలకు సంబంధించి విజయ్ దేవరకొండ లేదా ఆయన బృందం నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలకు ముందు అన్ని కోణాలను పరిశీలిస్తామని తెలిపారు.
