Chiru Leaks About Anaswara Rajan Role in Kaka: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియమణి, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, మురళీ శర్మ, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు, బాబీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో.. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
కాకా సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో అనస్వర పోషిస్తున్న పాత్ర గురించి చిరు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ కాకా మూవీలోని అసలు సస్పెన్స్ రివీల్ చేశారు. కాకాలో అనస్వర అద్భుతంగా నటించిందని ప్రశంసించిన చిరంజీవి.. ఆమె పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘అనస్వర.. నువ్వేమైనా నీ పాత్ర గురించి మాట్లాడతావా?. తను మాట్లాడదు.. మాట్లాడలేదు. మాట్లాడడం ఆమెకు నచ్చదు. నేను చెప్పిన ఈ లైన్‌ను మీరు ఇంటికి వెళ్లాక బాగా గుర్తుచేసుకుని ఆలోచించండి. అప్పుడు అసలు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది’ అని చిరంజీవి అన్నారు.
కాకాలో మూగ అమ్మాయి పాత్రలో అనస్వర రాజన్ కనిపించనున్నట్లు చిరంజీవి పరోక్షంగా హింట్ ఇచ్చారు. చిరు వ్యాఖ్యల అనంతరం అనస్వర ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ కూడా అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ‘సర్.. మీరు సస్పెన్స్ లీక్ చేసేశారు’ అన్నట్లుగా ఆమె స్పందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదల తేదీ, స్టార్ కాస్ట్‌తో ఆసక్తి రేకెత్తిస్తున్న కాకా.. ఇప్పుడు అనస్వర పాత్ర చుట్టూ నెలకొన్న సస్పెన్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. కాకాలో మూగ అమ్మాయి పాత్ర అనస్వర చేస్తున్నారని ఎప్పటి నుంచో వస్తోన్న వార్తలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. మొత్తానికి ‘చిరు లీక్స్’ ద్వారా కాకా సినిమాలో అసలు సస్పెన్స్ బయటపడింది. మెగాస్టార్ తన లీక్స్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

