టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
Also Read : KOTA : రాజకీయాల్లోను ‘కోట’ ముద్ర.. ఎక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచారో తెలుసా.?
మెగాస్టార్ చిరంజీవి : ‘లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట. కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది.శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను’ అని అన్నారు.
నందమూరి బాలకృష్ణ : ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
