Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!

Khaidi Inspiration

Khaidi Inspiration

డీఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్‌ నంబర్‌ 1’ 2026 దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశాంక్‌ దువ్వూరు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. రవి శివతేజ, భాస్కర్‌ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. నేహా పఠాన్‌ హీరోయిన్. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలను మేళవిస్తూ విభిన్నమైన కథాంశంతో ఈ తెరకెక్కనుంది.

తన సినిమా ప్రయాణం గురించి నిర్మాత డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమా చూడటానికి పాఠశాలకు వెళ్లకుండా వరంగల్‌ వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి తనలో ఉన్న సినిమా కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నానని చెప్పారు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ దసరా రోజున ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు శశాంక్‌ దువ్వూరు చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని.. ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలతో పాటు మంచి సందేశాన్ని అందించే అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు.

శశాంక్‌ దువ్వూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నప్పటికీ.. ఆయన ప్రతిభపై, కథపై తనకు పూర్తి నమ్మకం ఉందని దామోదర్‌ నేరేళ్ల తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు. యువ నటీనటులతో పాటు విభిన్నమైన కథాంశం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖైదీ మూవీ 1983లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.