Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు

Rahul Sipligunj

Rahul Sipligunj

ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదయింది. తన స్నేహితుడితో ఉన్న వివాదంలో ప్రమేయం ఉందంటూ, బెదిరింపులకు పాల్పడ్డారని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాహుల్ సిప్లిగంజ్ స్నేహితుడైన కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయగా, తమ ఇద్దరి ఏకాంత సమయాల్లో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని రాహుల్ రెడ్డి బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. దీంతో సదరు యువతి  మార్చి 10న విశాఖ సీపీని కలసి ఫిర్యాదు చేసింది.

అలాగే ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ రెడ్డితో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మరికొంత మందిపై ఆ యువతి కేసు పెట్టింది. రాహుల్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు రాహుల్ సిప్లిగంజ్ సహా మరికొందరు తనను బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఎంవీపీ పోలీసులు ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా బయటకు వచ్చింది. సదరు యువతి రాహుల్ రెడ్డి నుంచి రూ. 1 కోటి డిమాండ్ చేసిందని ఆ డబ్బు ఇవ్వకపోవడంతోనే కావాలని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు రెండు వైపుల ఆరోపణలపై కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.