‘స్వాసిక’.. ఈ పేరు చెబితే చాలామందికి వెంటనే గుర్తు రాకపోవచ్చు. కానీ ‘ఇరుముడి’ సినిమాలో ధనలక్ష్మి టీచర్ అంటే మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా తన నటనతో ప్రేక్షకులను భయపెట్టించింది స్వాసిక. ఒకవైపు హీరోయిన్‌గా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇంకోవైపు విలన్‌గా విభిన్న పాత్రల్లో మెప్పిస్తోంది. తెలుగులో ఇప్పటికే పరిచయమైనప్పటికీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె మరింత చేరువైంది మాత్రం ఇరుముడి సినిమాతోనే.
ప్రస్తుతం స్వాసిక కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. స్వాసిక నటించిన సినిమాలు విజయాలు సాధిస్తుండటంతో.. ఆమె పేరు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. స్వాసిక ఉంటే.. మూవీ హిట్టే అనే టాక్ నడుస్తోంది. సూర్య నటించిన కరుప్పు, రవితేజ నటించిన ఇరుముడి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. అంతేకాకుండా సూపర్‌హిట్‌గా నిలిచిన ‘నూరు సామి’ సినిమాలో ప్రధాన పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగులో ‘వంద దేవుళ్లు’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు స్వాసిక మరో ఆసక్తికరమైన పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఓ తార’ సినిమాలో ఆయనకు అక్కగా స్వాసిక కనిపించనుంది. దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే దుల్కర్ తెలుగులో తన విజయ పరంపరను కొనసాగించడంతో పాటు.. సాత్వికకి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్వాసికకు కూడా ఈ సినిమా విజయం కీలకం కానుంది. గత ఏడాది చివర్లో విడుదలైన శంభాల, ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు ఏవోటీ కూడా హిట్ అయితే.. స్వాసిక వరుసగా మూడో విజయాన్ని అందుకున్నట్లవుతుంది. దీంతో ఆమె హ్యాట్రిక్ విజయంపై ఆసక్తి నెలకొంది. 35 ఏళ్ల స్వాసిక అసలు పేరు.. పూజ విజయ్. కొన్ని తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో సహాయక పాత్రలలో చేసింది. వసంత, కుమారి, వివేకానందన్ విరలాను, లుబ్బర్ పాండు చిత్రాలతో బాగా ప్రసిద్ది చెందింది.

