Site icon NTV Telugu

Rajpal Yadav Bail: బాలీవుడ్‌ నటుడికి మధ్యంతర బెయిల్.. రూ.1.5 కోట్ల డిపాజిట్‌ సహా కఠిన షరతులు..

Rajpal Yadav Bail

Rajpal Yadav Bail

Rajpal Yadav Bail: చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. 11 రోజుల పాటు తీహార్‌ జైలులో ఉన్న ఆయనకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్‌కు కఠిన షరతులు విధించింది.. అయితే, రూ. 9 కోట్ల బకాయిల చెల్లింపులో విఫలమైనందున గత వారం ఢిల్లీ హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఫిబ్రవరి ప్రారంభంలో రాజ్‌పాల్ యాదవ్‌ను లొంగిపోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన తీహార్ జైలులో 11 రోజులు గడిపారు.

తాజాగా, ఫిబ్రవరి 16న హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ మార్చి 18 వరకు మాత్రమే వర్తిస్తుంది. షాజహాన్‌పూర్‌లో జరిగే తన మేనకోడలు వివాహానికి హాజరు కావడానికి ఆయనకు ఈ ఉపశమనం లభించింది. ఈ స మయంలో కఠినమైన కండీషన్స్‌ పెట్టింది..

కోర్టు విధించిన షరతులు
– రూ.1.5 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ (DD) డిపాజిట్ చేయాలి
– తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకు అప్పగించాలి
– తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది

అయితే, రాజ్‌పాల్ యాదవ్ న్యాయవాది కోర్టుకు తెలియజేసిన ప్రకారం, ఇప్పటికే రూ.1.5 కోట్ల డీడీ జమ చేశారు. తదుపరి విచారణ మార్చి 18న జరగనుంది.

అసలు కేసు నేపథ్యం ఏంటి?
రాజ్‌పాల్ యాదవ్ 2010లో తన దర్శకత్వ ప్రయత్నం అయిన Ata Pata Laapata కోసం సుమారు రూ.5 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైన తర్వాత రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన జారీ చేసిన చెక్కులు బౌన్స్ కావడంతో, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద కేసు నమోదైంది. జరిమానాలు, వడ్డీలు కలిపి మొత్తం బకాయి సుమారు రూ.9 కోట్లకు పెరిగింది. ఫిర్యాదుదారు సంస్థ మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లిస్తానని ఇచ్చిన హామీని పలుమార్లు నిలబెట్టుకోకపోవడంతో కోర్టు కఠినంగా వ్యవహరించింది.

కోర్టు వ్యాఖ్యలు
గత వారం బెయిల్‌ను నిరాకరిస్తూ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ వ్యాఖ్యానిస్తూ, కోర్టు ఆదేశాల వల్ల కాదు, ఒప్పంద నిబంధనలు పాటించనందునే ఆయన జైలులో ఉన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, తాజాగా ఆయన న్యాయ బృందం కొన్ని షరతులతో బెయిల్ పొందడంలో విజయవంతమైంది. మొత్తంగా ఈ కేసు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మార్చి 18న జరిగే తదుపరి విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version