BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్‌..సక్సెస్‌ తర్వాత నో ఛాన్స్‌

Bhagyasri Bores

Bhagyasri Bores

సినీ పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎటు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. మొదటి సినిమా ప్లాప్ అయితే ఆఫర్లు రావడం గగనమవుతుంది. కానీ, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. అయినప్పటికీ ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయిన నిర్మాతలు ఆ వెంటనే వరుస అవకాశాలు ఇచ్చారు.

‘మిస్టర్ బచ్చన్’ తర్వాత భాగ్యశ్రీకి వరుసగా ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. ఆమె నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కింగ్‌డమ్’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేక తీవ్రంగా నిరాశపరిచాయి. వరుస ప్లాపులు పడుతున్న సమయంలోనూ అక్కినేని అఖిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లెనిన్’ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు, సినిమా ఫలితానికి “ఓకే” అనే టాక్ వచ్చింది. కానీ విచిత్రమేమిటంటే పర్వాలేదనిపించిన సినిమా పడిన తర్వాతే టాలీవుడ్‌లో ఈ భామకు కొత్త ఆఫర్లు రావడం దాదాపుగా తగ్గిపోయాయి. తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లు సైన్ చేయకపోయినప్పటికీ ఇతర భాషల్లో భాగ్యశ్రీ బోర్సే భారీ ఆఫర్లనే సొంతం చేసుకుంటోంది. తమిళంలో ఏకంగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సియోన్ చిత్రంలో శివకార్తికేయన్ సరసన కథానాయికగా నటిస్తోంది. మరోవైపు ‘ఆపరేషన్ గంగ’ అనే మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌తో మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెడుతోంది. తెలుగులో ప్రస్తుతానికి గ్యాప్ వచ్చినా, తమిళ, మలయాళ చిత్రాల విజయాలతో మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.