Bhagyashree: “వయసు కాదు.. పాత్ర గొప్పది”.. రితేష్‌కు తల్లిగా నటించడంపై భాగ్యశ్రీ క్లారిటీ

Bhagyashree, Raja Shivaji Movie,

Bhagyashree, Raja Shivaji Movie,

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, వీరయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చరిత్రాత్మక చిత్రం ‘రాజా శివాజీ’ (Raja Shivaji). బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh) ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాలో శివాజీ మహారాజ్ పాత్రతో పాటు ఆయనను వీరుడిగా తీర్చిదిద్దిన తల్లి రాజమాత జిజాబాయి పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది. ఈ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ నటించడం విశేషం. అయితే, ఈ పాత్ర ఎంపికపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆసక్తికర చర్చపై తాజాగా భాగ్యశ్రీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

నిజజీవితంలో రితేష్ కంటే భాగ్యశ్రీ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పెద్దవారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోలకు వయసు పెరిగినా లీడ్ రోల్స్ దక్కుతుంటాయి, కానీ హీరోయిన్లకు వయసు పెరిగేకొద్దీ మాతృక పాత్రలు ఇస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న రితేష్‌కు తల్లిగా నటించడానికి భాగ్యశ్రీ ఎలా ఒప్పుకున్నారనే చర్చ నెట్టింట మొదలైంది. దీనిపై భాగ్యశ్రీ తనదైన శైలిలో సమాధానమిస్తూ.. ‘మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మహనీయుల కథల్లో ఒక చారిత్రాత్మక పాత్ర పోషించే అవకాశం వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేం. రాజమాత జిజాబాయి లాంటి పవర్‌ఫుల్ పాత్ర లభించినప్పుడు వయస్సు వ్యత్యాసాలతో సంబంధం లేదు’ అని భాగ్యశ్రీ స్పష్టం చేశారు. ఈ సినిమాలో తన లుక్ గురించి చెప్తూ.. ప్రముఖ స్టార్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ (Santosh Sivan) స్వయంగా తనను సంప్రదించారని వెల్లడించారు. స్క్రీన్‌పై రితేష్‌కు తల్లిగా పర్‌ఫెక్ట్‌గా సెట్ అవ్వడం కోసం కొన్ని ప్రత్యేకమైన కెమెరా లైటింగ్ టెక్నిక్స్, మేకప్ ద్వారా తనను కొంచెం వయసు పైబడినట్లుగా చూపించారని ఆమె పేర్కొన్నారు.