Site icon NTV Telugu

Bapu Bomma Vishwa Mahila Awards: ‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డ్స్.. కొణిదెల అంజనా దేవికి పురస్కారం!

Bapu Bomma Vishwa Mahila Awards

Bapu Bomma Vishwa Mahila Awards

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో ‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డ్స్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తెలుగు ప్రజల గుండెల్లో బాపుబొమ్మగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దివ్యవాణి.. సినిమా రంగంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్, ప్రముఖ నటుడు-రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం. కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించారు. అవార్డులు అందుకున్న వారిలో మెగా మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యుఎస్‌ఏ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యుఎస్‌ఏ) తదితర ప్రముఖ మహిళలు ఉన్నారు.

సినిమా రంగంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లో విశేష సేవలందిస్తున్న దివ్యవాణి ప్రారంభించిన ‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డులను మెగా మాతృమూర్తి కొణిదెల అంజనా దేవితో ప్రారంభించడం ఎంతో అభినందనీయమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు. సమాజంలో విశేష సేవలు చేస్తున్న మహిళలను సన్మానించడం ద్వారా ఇతర మహిళలకు స్ఫూర్తినివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ దివ్యవాణి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దివ్యవాణి చెప్పారు.

Exit mobile version