Site icon NTV Telugu

Chiranjeevi Fans : చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాం కానీ మా పోరాటం ఆగదు!

Chiranjeevi

Chiranjeevi

సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు హైదరాబాద్‌లోని హోటల్ నానీస్ బ్యాంక్వెట్ హాల్‌లో ఆదివారం (సెప్టెంబర్ 28) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి వచ్చిన ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ, చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకొని పోలీస్ ఫిర్యాదు నుండి తాత్కాలికంగా వెనక్కి తగ్గాలని సూచించడంతో అభిమానులు ఆ నిర్ణయాన్ని గౌరవించారు. అయినప్పటికీ, తమ పోరాటం ఆగదని అభిమానులు స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హోటల్ నానీస్ బ్యాంక్వెట్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ముఖ్యనేత మోహన్ నేతృత్వం వహించారు. గౌరవ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి వందలాది మంది అభిమానులు హాజరయ్యారు. బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలను అభిమానులు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇది అభిమానుల సెంటిమెంట్‌ను గాయపరిచిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :OG : తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గింపు?

సమావేశంలో మొదట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత సోమవారం (సెప్టెంబర్ 29) రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 300 పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు దాఖలు చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అభిమానులతో సంప్రదించి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లొద్దని, ఈ వివాదాన్ని పెద్దది చేయొద్దని సూచించారు. చిరంజీవి పిలుపును గౌరవిస్తూ అభిమానులు తాత్కాలికంగా ఫిర్యాదు నుండి వెనక్కి తగ్గారు. చిరంజీవి సలహాతో ఫిర్యాదు ప్రక్రియను నిలిపివేసినప్పటికీ, అభిమానులు తమ ఆగ్రహాన్ని హైలైట్ చేశారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ముఖ్యనేత మోహన్ మాట్లాడుతూ, “చిరంజీవి గారి మాటను గౌరవిస్తూ ప్రస్తుతానికి ఆగాము. కానీ మా పోరాటం ఆగదు. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల గుండెలను గాయపరిచాయి. మా నాయకుడి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయిలోనైనా పోరాడతాం,” అని అన్నారు.

Also Read :Vijay TVK Karur stampede: విజయ్ కావాలనే ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట..ఎఫ్ఐఆర్లో సంచలన అంశాలు

గౌరవ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు మాట్లాడుతూ, “మరో రెండు రోజుల్లో మళ్లీ సమావేశమై, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం. చిరంజీవి గారి సూచన మేరకు ఇప్పుడు ఆగినప్పటికీ, అభిమానుల ఆవేదనను సమర్థవంతంగా వ్యక్తం చేసేలా చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు. చిరంజీవి అభిమానులు మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో మళ్లీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై తదుపరి చర్యలను నిర్ణయించనున్నారు. “మేము చట్టపరమైన మార్గంలోనే ముందుకెళ్తాం. చిరంజీవి గారి గౌరవం మాకు ముఖ్యం,” అని మోహన్ స్పష్టం చేశారు. అభిమానులు శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు కాగా, చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు. మరోపక్క ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉంన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version