NTV Telugu Site icon

‘మాయ‌’ చేస్తున్న‌ అశోక్ సెల్వ‌న్, ప్రియా ఆనంద్!

ద‌గ్గుబాటి రానా తొలి చిత్రం లీడ‌ర్తో తెలుగువారి ముందుకొచ్చింది ప్రియా ఆనంద్. అలానే గ‌త యేడాది ఓటీటీలో విడుద‌లైన నిన్నిలా నిన్నిలాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశోక్ సెల్వ‌న్. వీరిద్ద‌రూ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన షార్ట్ ఫిల్మ్ మాయ‌. 2017లో రూపుదిద్దుకున్న ఈ ల‌ఘు చిత్రానికి అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపు ల‌భించింది. దీనిని ఒక‌ప్ప‌టి పాపుల‌ర్ డైరెక్ట‌ర్ ఐవీ శ‌శి త‌న‌యుడు అని ఐ.వి. శ‌శి రూపొందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ స‌మ‌యంలో ఏర్ప‌డిన అనుబంధంతోనే ఆ త‌ర్వాత అశోక్ సెల్వ‌న్, అని కాంబోలో నిన్నిలా నిన్నిలా తెర‌కెక్కింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ కు చెందిన ఉండ్రాగ ఎంట‌ర్ టైన్ మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో మాయ‌ షార్ట్ ఫిల్మ్ ను ఐ, ఉయ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. దీనికి ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం, ఎడిటింగ్ అని నే చేశారు. ఓ స్క్రీన్ ప్లే రైట‌ర్ త‌న కొత్త స్క్రిప్ట్ ను రాసుకోవ‌డానికి ఎలా మ‌ధ‌న ప‌డ్డాడు, క‌మ‌ర్షియ‌ల్ స్టోరీని రాయ‌డం కోసం మొత్తం ప్రపంచాన్నే మోసం చేసేలా ఎలాంటి ప్రేమ‌క‌థ‌ను త‌యారు చేశాడు అన్న‌దే మాయ‌. 11 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ చికాగో సౌత్ ఏసియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2017లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ (ఫిక్ష‌న్) కేట‌గిరిలో అవార్డును గెలుచుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్ప‌టికైనా యూ ట్యూబ్ లో ప్ర‌త్య‌క్షం కావ‌డం సినీ అభిమానుల‌ను ఆనంద ప‌రుస్తోంది.