పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం పవన్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవన్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీర మల్లు’, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ తో ఒక సినిమా, బండ్ల గణేష్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు పవన్. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ జేబీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జేబీ ప్రొడక్షన్ హౌస్ లో జె భగవాన్ తో కలిసి పవన్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తానని నిర్మాత జె పుల్లా రావు వెల్లడించారు. కథ సిద్ధంగా ఉందని, పిఎస్‌పికె తన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. కాగా నిర్మాతలు జె భగవాన్, జె పుల్లా రావు కలిసి జేబీ ఎంటర్టైన్మెంట్స్ ప్రారంభించారు. ఈ బ్యానర్ పై వారు నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘రిపబ్లిక్’. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4 న విడుదల కానుంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని నిర్మాత పుల్లా రావు తెలిపారు.
జేబీ ఎంటర్టైన్మెంట్స్ తో పవర్ స్టార్ మూవీ..!
