Anirudh: సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టిన అనిరుధ్.. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో మ్యాజిక్

Anirudh Ravichander

Anirudh Ravichander

Anirudh: సినీ పరిశ్రమలో తన మ్యూజిక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కెరీర్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు వెండితెరపై తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను షేక్ చేసిన ఈ మ్యూజిక్ మెజీషియన్, ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన సొంత మ్యూజిక్ లేబుల్ ‘అల్బుకర్కీ రికార్డ్స్’ అండ్ ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందిన ‘అరవింద్’ అనే స్పెషల్ ప్రైవేట్ సాంగ్‌ను అనిరుధ్ తాజాగా విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో పక్కా పాప్, హిప్ హాప్ స్టైల్‌లో వచ్చిన ఈ ట్రాక్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.

2012లో ‘వై దిస్ కొలవెరి డి’ అనే ఒకే ఒక్క పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనిరుధ్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. సౌత్‌లో జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్-1 వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించారు. కేవలం సౌత్‌లోనే కాకుండా, బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాతో హిందీ మార్కెట్‌ను సైతం తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్నో ఏళ్ల కష్టం, మరెన్నో విలక్షణమైన ట్యూన్స్‌తో ఇండస్ట్రీలో ‘రాక్‌స్టార్’ అనే బ్రాండ్‌ను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా ఒక పాటను రిలీజ్ చేయడం చాలా సులభం కావచ్చు, కానీ గాడ్‌ఫాదర్ లేని ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో, ఒక సామాన్య సంగీతకారుడు తన ప్రతిభను నిరూపించుకోవడానికి పడే తపన, ఎదుర్కొనే సవాళ్లను బేస్ చేసుకుని ఈ ‘అరవింద్’ సాంగ్‌ను డిజైన్ చేశారు. ఈ పాటలో కనిపించే ‘అరవింద్’ పాత్ర మరెవరో కాదు.. అనిరుధ్ తనను తాను ప్రతిబింబించుకున్న క్యారెక్టర్. అహంకారం, అవమానాలు, అడ్డంకులు ఎదురైనా సరే.. సంగీతంపై ఉన్న పిచ్చితో, ప్యాషన్‌తో జీవితాన్ని మ్యూజిక్‌కే అంకితం చేసిన ఒక యువకుడి కథే ఈ పాట. ఏదో ఒక రోజు తన టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తుందనే నమ్మకంతో ఆ యువకుడు సాగించే పోరాటమే ‘అరవింద్’.

×
×
Ad