ప్రతిష్టాత్మక మల్టీలింగ్వల్ మూవీ “ఆర్ఆర్ఆర్” నిస్సందేహంగా ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ కోసం సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ మ్యూజిక్ సెషన్ ముగిసింది. ఈ సందర్భంగా “ఆర్ఆర్ఆర్”కు సంగీతం అందిస్తున్న కీరవాణి “ఆర్‌ఆర్‌ఆర్ కోసం అనిరుధ్‌తో గొప్ప మ్యూజిక్ సెషన్ జరిగింది. సమర్థత, శక్తి, ప్రతిభ, అద్భుతమైన సహచరుల బృందం అతని ప్రధాన ఆస్తులు”అని ట్వీట్ చేస్తూ అనిరుధ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ట్వీట్ కు అనిరుధ్ స్పందిస్తూ “ఇట్ వాజ్ మై ప్లెజర్ సర్… మచ్ లవ్ టూ యు అండ్ యువర్ టీం” అని రిప్లై ఇచ్చారు.
Read Also : మరపురాని అభినేత్రి జయంతి
స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీంల కల్పిత కథ ఆధారంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, శ్రియా శరణ్ మరియు అజయ్ దేవ్‌గన్ నటించిన భారీ చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”. ఈ చిత్రంతో బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవ్‌గన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించారు, కెమెరాను కెకె సెంథిల్ కుమార్, ఎడిటింగ్ ఎ శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. పెన్ మూవీస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ సినిమా “ఆర్ఆర్ఆర్” బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసింది.