సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’ నుంచి ఒక హృదయస్పర్శి పాట విడుదలైంది. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణలో, విజయపాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, గ్లింప్స్, టీజర్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా, ‘అనగా అనగా కథలా’ అనే ఫీల్-గుడ్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పాటను టీకేఆర్ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో బుధవారం రోజున కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి విడుదల చేశారు. కార్తిక్ ఈ పాటను ఆలపించగా, ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. సనరే రచించిన సాహిత్యం తాతయ్య మరియు మనవరాలి మధ్య అనుబంధాన్ని, ఆ భావోద్వేగాన్ని సునిశితంగా వ్యక్తీకరిస్తుంది.
పాట విడుదల కార్యక్రమంలో సత్య రాజ్ మాట్లాడుతూ, “టీకేఆర్ కాలేజీలో విద్యార్థుల ఉత్సాహం, శక్తి చూస్తుంటే సంతోషంగా ఉంది. దాదాపు 14 వేల మంది విద్యార్థుల మధ్య ఈ పాటను విడుదల చేయడం ఆనందదాయకం. పాటను రిలీజ్ చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి సహకరించిన హరనాథ్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ‘త్రిబాణధారి బార్భరిక్’ నుంచి ‘అనగా అనగా కథలా’ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ చూసి ఆదరించాలి” అని అన్నారు. ఈ పాట విడుదలతో ‘త్రిబాణధారి బార్భరిక్’పై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా త్వరలో విడుదల కానుంది.
