పార్క్ హయ్యత్ లో అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు, పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్,అల్లు రామలింగయ్య ఫ్యామిలీ సభ్యులు హాజరయ్యారు. నటులు కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, ఆలీ, సునీల్, ఎల్.బి.శ్రీరామ్, రావు రమేష్, పృథ్విరాజ్ తదితరుల్ని సన్మానించారు. ఈ సందర్భంగా నటుడు, రచయిత తనికెళ్ళ భరణి అల్లురామలింగయ్య గురించి పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.
సినిమాల్లో నటించేటప్పుడు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సారస్వతాన్ని ఆయన ఎంతగానో గ్రహించేవారు. ఆ వయసులోనూ ఆయన తనకు తెలియని అంశాలను తెలుసుకునేవారు. ఆయనతో వుండడం అనేది అద్భుతమయిన అనుభూతి అన్నారు భరణి. ఆయనపై అపారమయిన ఇష్టంతో తాను రాసుకున్న కవితను సభికులకు చదివి, ఆస్వాదిస్తూ వినిపించారు తనికెళ్ళ భరణి.
అల్లు రామలింగయ్య రోజు రోజుకీ విలువ పెరిగే కోహినూర్ వజ్రం లాంటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య
ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఉన్నాడు…
అయితే, అప్పుడు ఆయన ఇంటి పేరు అల్లు కాదు… తెనాలి అనాలి
ఆయన అక్బర్ పాదుషా దర్భార్ లో కూడా ఉన్నాడు.. అప్పుడు ఆయన పేరు బీర్బల్ కాబోలు
ఆయన హాస్యం హోమియోపతి మందులా తెల్లగా, స్వచ్ఛంగా, శుభ్రంగా, గుండ్రంగా ఉంటుంది
మాయా బజార్ నించి మావిచిగురు దాకా వయసును మూటగట్టి అటకమీద పెట్టి పడుచు కుర్రాడిలా గెంతడం అల్లుకే చెల్లు
శంకరాభరణంలో స్నేహితుడంటే వాడు అనిపించాడు అల్లు
ముత్యాల ముగ్గులో నటుండే వీడు అనిపించాడు అల్లు
పాలకొల్లు నుంచి సైకిల్ మీద ఢిల్లీ కెళ్ళి పద్మశ్రీని ఫ్లైట్లో పట్టుకొచ్చేసిన ఘనుడు అల్లురామలింగయ్య అంటూ తన కవితా గానంతో సభికుల్ని అలరించారు తనికెళ్ళ భరణి.