Allu Arjun Raaka Shooting Update: ‘పుష్ప 2’ తర్వాత ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ ప్రాజెక్ట్‌కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న బన్నీ.. ఎక్కువ శాతం చిత్రీకరణ ముంబైలో జరుగుతుండటంతో హైదరాబాద్ టు బాంబే మధ్య తరచూ ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో బన్నీ విమానాశ్రయంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ ప్రయాణాల హడావుడి నుంచి బన్నీకి కొంత ఉపశమనం లభించనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం రాకా సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. అక్కడ చిత్రీకరణ పూర్తయిన వెంటనే చిత్రబృందం హైదరాబాద్‌కు మకాం మార్చనుందని టాక్. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ యాక్షన్ సన్నివేశాలను దుబాయ్‌లో షూట్ చేయాలని భావించారట. అయితే అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్లాన్‌లో మార్పులు చేసి హైదరాబాద్‌లో చిత్రీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విదేశాల్లో తదుపరి చిత్రీకరణ జరగనుందని సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది.
రాకాను హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించేందుకు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ దాదాపు 40 నుంచి 50 శాతం పూర్తయినట్లు టాక్. వచ్చే ఏడాది వేసవి నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేసి.. అదే ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

