అల్లరి నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆల్కహాల్’. కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. ‘ఆల్కహాల్’ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ ను అద్భుతంగా రూపొందించారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, మరియు దాని చుట్టూ జరిగే సంఘటనల సమాహారాన్ని ఈ టీజర్ సూచిస్తుంది.
హాస్యం మాత్రమే కాకుండా, నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా పేరుగాంచిన అల్లరి నరేష్, ‘ఆల్కహాల్’ రూపంలో మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందించబోతున్నారు. ఇందులో సత్య సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో నరేష్, పూర్తిగా కొత్త మార్గంలో అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రేక్షకులలో కాస్త క్యూరియాసిటీని పెంచుతుందనే చెప్పాలి. సుహాస్ నటించిన ‘ఫ్యామిలీ డ్రామా’తో విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన, బలమైన సాంకేతిక విలువలతో కూడిన అద్భుతమైన కథాంశంతో తిరిగి వస్తున్నారు. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 2026న ‘ఆల్కహాల్’ విడుదల కానుంది.
