Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి, గ్రామీణ అనుబంధాలు, సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించే మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ హీరోగా ‘శనార్థి’ అనే కొత్త చిత్రం ఆఫీషియల్ గా ప్రారంభమైంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, కొత్త దర్శకుడు రాజ్ గణేష్ ఉప్పునూటిని పరిచయం చేస్తుండటం విశేషం. ఈ మూవీని సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఆదిత్య మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. దర్శకుడు సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూటి ఈ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు. ఇప్పటికే ‘ఓదెల’ ఫ్రాంచైజీకి షోరన్నర్‌గా సంపత్ నంది సంపాదించుకున్న గుర్తింపు ఈ ప్రాజెక్ట్‌పై మరింత నమ్మకాన్ని పెంచుతోంది.
సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ నిన్న ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు. విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. తెలంగాణలో సంప్రదాయ పలకరింపుగా వినిపించే ‘శనార్థి’ అనే పదాన్ని చిత్ర బృందం టైటిల్‌గా ఎంచుకోవడం విశేషం. ఇందులో అఖిల్ రాజ్ సరసన నాగ దుర్గ కథానాయికగా నటిస్తున్నారు. తెలంగాణ జానపద గీతాలతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ దుర్గకు ఇది హీరోయిన్‌గా తొలి సినిమా. ఆమె జానపద నేపథ్యం ఈ గ్రామీణ కథకు మరింత సహజత్వాన్ని తీసుకువస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆమె మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రముఖ సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ గ్రామీణ కథకు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. కుటుంబ బంధాలు, గ్రామీణ విలువలను ప్రధానంగా తీసుకుని తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో రూపొందుతున్న ‘శనార్థి’ టైటిల్‌తోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సంపత్ నంది నిర్మాణం, కొత్త దర్శకుడు రాజ్ గణేష్ ఉప్పునూటి విజన్, అఖిల్ రాజ్, నాగ దుర్గ జోడీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయా అన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లకు పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది, వరుణ్ సందేశ్‌తో తీసిన ‘ఏమైంది ఈవేళ’ (2010) చిత్రంతో మెగాఫోన్ పట్టి, ఆ తర్వాత రామ్ చరణ్‌తో భారీ బ్లాక్‌బస్టర్ ‘రచ్చ’ (2012)ను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. రవితేజతో ‘బెంగాల్ టైగర్’ (2015), గోపీచంద్‌తో ‘గౌతమ్ నంద’ (2017), ‘సీటీమార్’ (2021) వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన, తన సొంత బ్యానర్‌పై ‘పేపర్ బాయ్’, ఓటీటీ హిట్ ‘ఓదెల రైల్వేస్టేషన్’, ఇటీవల థియేటర్లలోకి వచ్చిన జగపతి బాబు ‘సింబా’ వంటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇప్పుడు ‘శనార్థి’తో మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. మరి ఈ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

