Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!

Thalapathyvijay

Thalapathyvijay

Aishwarya Lekshmi: తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే గమ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తలపతి విజయ్‌కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు ఆయన వెంటే నడుస్తుండగా, తాజాగా సినీ ప్రముఖులు కూడా విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’, ‘థగ్ లైఫ్’ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన నా ‘విజయ్ అన్న’.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. తాను విజయ్‌కు వీరాభిమానినని చెప్పారు. “నేను విజయ్ అన్నను ఎంతో ఆరాధిస్తాను. ప్రజల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అభిమానులతో ఆయనకున్న అనుబంధమే ఆయనను రాజకీయాల వైపు నడిపించాయి. ప్రజా జీవితంలోకి రావాలన్న ఆయన నిర్ణయానికి నా పూర్తి మద్దతు ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు. అయితే తాను కేరళకు చెందిన వ్యక్తిని కావడం వల్ల ఆయనకు ఓటు వేసే అవకాశం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడటం అవసరమని తాను నమ్ముతానని, విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. చివరగా తుది నిర్ణయం ప్రజలదేనని ఆమె పేర్కొన్నారు.

విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై దక్షిణాది దిగ్గజ నటులు భిన్నంగా స్పందించారు. గతంలో రజనీకాంత్.. విజయ్‌కు తన అభినందనలు తెలుపుతూ, ఆయన విజయం సాధించాలని క్లుప్తంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కమల్ హాసన్ కూడా విజయ్‌ను తాను రాజకీయాల్లో శత్రువుగా చూడటం లేదని స్పష్టం చేశారు. మోహన్ లాల్ మాట్లాడుతూ.. రాజకీయాలు తన రంగం కాదని, నిర్ణయాలు తీసుకోవడం విజయ్ ఇష్టమని అన్నారు. మమ్ముట్టి ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు.

మే 4న తేలనున్న భవితవ్యం..
2024లో ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీని స్థాపించిన విజయ్, 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా బరిలోకి దిగారు. ఇటీవల ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. విజయ్ రాజకీయ భవిష్యత్తును ఈ ఫలితాలు ఎలా ప్రభావితం చేస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ఐశ్వర్య లక్ష్మి గురించి చూస్తే.. ప్రస్తుతం ఈ హీరోయిన్ ‘ఆశా’, ‘గట్ట కుస్తీ 2’తో పాటు సాయి దుర్గా తేజ్ సరసన ‘సంబరాల యతి గట్టు’ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.