ఫిల్మ్ సెలబ్రిటీస్ పంథా మార్చుకున్నారు. కొవిడ్ 19 సెకండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్ననేపథ్యంలో వారూ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతవరకూ తమ సినిమా పబ్లిసిటీకి ఉపయోగించుకున్న సోషల్ మీడియాల మాధ్యమంతో కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతుగా సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారు. అయితే… యువ కథానాయకుడు అడివి శేష్… ఈ పనితో పాటు మరో గొప్ప పని కూడా చేశాడు. హైదరాబాద్ కోఠీ ప్రభుత్వ హాస్పిటల్ లో దాదాపు 300 కొవిడ్ పేషెంట్స్ చికిత్స చేయించుకుంటున్నారు. అయితే… అక్కడ తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయం సోషల్ మీడియా ద్వారా అడివి శేష్ దృష్టికి వచ్చింది. కరోనా బాధితులతో పాటు అక్కడి వైద్య సిబ్బంది సైతం డీహైడ్రేషన్ కు గురౌతున్నారనే విషయాన్ని గ్రహించిన అడివి శేష్ వెంటనే 850 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు. అలానే ఆ హాస్పిటల్ అవసరాలకు సరిపడ త్రాగునీటిని సరఫరా చేసేందుకు శాశ్వత ప్రణాళికకూ తాను సహకరిస్తానని హామీ ఇచ్చాడు. సమయానికి కరోనా బాధితులను ఆదుకున్న అడివి శేష్ ను అక్కడి వారు అభినందించారు. విశేషం ఏమంటే… అడివి శేష్ సైతం ఓ డాక్టర్ కొడుకే! అందుకే రోగుల కష్టాలను అతను చక్కగా అర్థం చేసుకున్నాడు!!
300 మంది కరోనా పేషంట్స్ దాహార్తి తీర్చిన అడివి శేష్!
